YSR | వైఎస్ఆర్ జిల్లా పేరును మార్చాలని ఏపీ మంత్రి సత్యకుమార్ కోరారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి మంత్రి లేఖ రాశారు. వైఎస్ఆర్ జిల్లాగా ఉన్న కడప జిల్లాను వైఎస్ఆర్ కడపగా గెజిట్లో మార్చాలని విజ్ఞప్తి చేశారు.
కలియుగ దైవం వేంకటేశ్వరుడి సన్నిధికి చేరడానికి తొలి గడప కడప అని మంత్రి సత్యకుమార్ అన్నారు. ఒక చారిత్రక నేపథ్యం, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉన్నాయని.. వీటి పట్ల కనీస అవగాహన లేని మాజీ సీఎం వైఎస్ జగన్ పేర్ల పిచ్చితో జిల్లా పేరు వైఎస్ఆర్ జిల్లాగా మార్చడం తప్పు అని విమర్శించారు. అందుకే కడప జిల్లా ప్రజల మనోభావాల మేరకు జిల్లా పేరును గెజిట్లో మార్పులు చేసి గతంలో జరిగిన తప్పును సరిదిద్దాల్సిందిగా కోరారు. ఈ మేరకు కడప జిల్లాకు ఉన్న విశిష్టతను ఆయన లేఖలో వివరించారు.
‘ పూర్వం ఈ ప్రాంతమంతా రాక్షస నిలయంగా ఉండేది. ఈ ప్రాంత వాసులకు దానవ పీడ తొలగించడానికి మత్స్యావతారంలో ఆవిర్భావించాడు. ఇక్కడికి ఒకసారి కృపాచార్యుల వారు తీర్థయాత్రలు చేస్తూ వచ్చారు. ఈ హనుమత్ క్షేత్రంలోనే బస చేశారు. అక్కడి నుంచి తిరుమల వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలని సంకల్పించారు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ముందుకు సాగలేకపోయారు. దీంతో శ్రీవారి దర్శనం కోసం కృపాచార్యులు తపించిపోయారు. ఆ తర్వాత ఆయన శ్రీవారి కృపను పొందారు. తనలాగే శ్రీవారి దర్శనానికి వెళ్లలేకపోయిన నిస్సహాయుల కోసం తిరుమల శ్రీవారి ప్రతిరూపాన్ని ఈ క్షేత్రంలో కృపాచార్యులు ప్రతిష్టించారు. శ్రీవారి ఆదేశానుసారం హనుమంతుడి విగ్రహం ముందు ప్రతిష్టించబడిన శ్రీవేంకటేశ్వర స్వామి భక్త వత్సలుడై ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. నాటి నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులు ముందుగా ఇక్కడి స్వామివారిని దర్శించుకోవడం ఆచారంగా మారింది. కృపాచార్యులు స్వామి వారి కృప పొందిన ప్రదేశం కాబట్టి ఈ ప్రాంతానికి కృపావతిగా నామకరణం చేశారు. ఆ కృపావతి కురపగా, కుడపగా క్రమేపి కడపగా ప్రసిద్ధి చెందింది. దీనిపై అవగాహనరాహిత్యంతో గత ప్రభుత్వం కడప జిల్లా పేరును వైఎస్ఆర్ జిల్లాగా మార్చింది. ‘ అని మంత్రి సత్యకుమార్ తన లేఖలో పేర్కొన్నారు.
ఈ పరిణామంపై శ్రీవారి భక్తుల మనసులు నొచ్చుకున్నాయని.. కానీ భయంతో ఎవరూ తమ అభిప్రాయాన్ని బయటపెట్టలేకపోయారని మంత్రి సత్యకుమార్ అన్నారు. సీఎంగా ఉన్న సమయంలో కడప జిల్లా అభివృద్దికి వైఎస్ఆర్ చేసిన అభివృద్దిని ఎవరూ కాదనలేరని చెప్పారు. అందుకే కడప చారిత్రక నేపథ్యాన్ని, వైఎస్ఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని విజ్ఞప్తి చేశారు.