అమరావతి : ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టును ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. మొన్న రాత్రి ప్రాజెక్టుకు వచ్చిన భారీ వరదతో మూడో గేటు కొట్టుకుపోయింది . ఇవాళ ప్రాజెక్టును సందర్శించిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. గేట్లు ఐదారేళ్లుగా తుప్పుపట్టి ఉండడంతో గేటు దెబ్బతిందని దీంతో నీళ్లు బయటకు పోయాయని మంత్రి తెలిపారు. రెండు టీఎంసీలు సముద్రంలోకి వదలక తప్పదని వెల్లడించారు. గేట్ల మరమ్మతులను త్వరలో ప్రారంభిస్తామని వివరించారు.
ఖరీఫ్‌కు సాగర్ నుంచి నీరు మళ్లించి గుండ్లకమ్మ నింపుతామని పేర్కొన్నారు. రైతులు ఆందోళన చెంద వలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణలో అశ్రద్ధ చేయడం వల్లే తరుచూ ప్రాజెక్టు గేట్లు మరమ్మతులకు లోనవుతున్నాయని ఆరోపించారు. ఈ విషయంలో కొందరు కావాలని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని తెలిపారు.
మూడు రోజుల నుంచి మూడో గేటు మరమ్మతుకు గురికావడంతో నీరు వృధాగా దిగువనకు పోతోంది. గేటు మరమ్మతులకు అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో గురువారం రాత్రి మూడో గేటు కొట్టుకుపోయింది.