గత వైసీపీ పాలనలో ఆధ్యాత్మిక ప్రాంతాల్లో కూడా విధ్వంసం జరిగిందని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. గత పాలకులు చెప్పుకోలేని విధంగా దేవాలయాల్లో తప్పులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాల్లో వైసీపీ పాలకులు చేసిన పాపాలను తామంతా మోస్తున్నామని వివరించారు. వారి పాపాలను కడిగే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఆధ్యాత్మికతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. దేవాలయాల్లో సామాన్యులకు ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు
కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పర్యటించారు. గ్రామంలోని తోటల శివాలయంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సనాతన ధర్మం పాటిస్తూ ఆలయాలను అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. పూర్తి శాస్త్రోక్తంగా దేవాలయాల్లో భగవంతునికి పూజా కైంకర్యాలు జరిగేలా చర్చలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తిరుమల పరకామణి అంశంపై శాసనమండలిలో వివరించామని తెలిపారు. తిరుమలలోని పరకామణి విషయంలో శాసనసభలో స్పీకర్ సమయం ఇవ్వకపోవడం వల్ల మాట్లాడలేకపోయామని తెలిపారు. అందుకే మండలిలో వివరణ ఇచ్చినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో పూర్తి వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో 361 దేవాలయాల పునర్నిర్మాణానికి రూ.500 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఖాళీగా ఉన్న దేవాలయాల ప్రాంగణాల్లో మొక్కలు నాటించే కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఆధ్యాత్మికత, భగవాన్ నామస్మరణలతో ప్రతి ఒక్కరూ నిత్యం ఆనందంగా ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న అన్న క్యాంటీన్ల తరహాలోనే గ్రామీణ ప్రాంతాల్లోని దేవాలయాల్లో ఉచిత అన్నప్రసాదం అందిస్తామని తెలిపారు.