అమరావతి : తెలుగుదేశం పార్టీ దిక్కుమాలిన రాజకీయాలు చేస్తోందని ఏపీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడుల నేపథ్యంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు 36 గంటల దీక్ష చేపట్టడంపై ఏపీ మంత్రి పేర్ని నాని విమర్శనాస్త్రాలు సంధించారు. 36 గంటల దీక్ష పేరుతో కొంగ జపం మొదలు పెట్టారని, కొంగ దీక్షలు చేస్తూ ఎవరిని మోసం చేస్తారని ప్రశ్నించారు. బూతులు సమర్థిస్తూ చంద్రబాబు దీక్షలు చేస్తున్నారా అని, ఈ దీక్ష ఎవరి కోసమని నిలదీశారు.
ప్రజలు ఆరాధించే గొప్ప మనిషిని బూతులు తిడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడుది ఎంత నీచత్వానికి అయిన తెగించే మనస్తత్వం అని నాని విమర్శించారు. టీడీపీ కార్యాలయంలో రెండు టేబుళ్లు విరిగినంత మాత్రాన రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలా? అని ప్రశ్నించారు. అమిత్ షాపై రాళ్లదాడి జరిగినప్పుడు రాష్ట్రపతి పాలన గుర్తుకురాలేదా? అమిత్ షాపై అల్లరిమూకలను ఎగదోసినప్పుడు ఆర్టికల్ 356 గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు.
చంద్రబాబు జీవితమంతా నేరమయమని, ఇవాళ ఒక బూతు మాట కోసం దొంగ దీక్ష చేస్తూ మరింత దిగజారి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి దిక్కుమాలిన విపక్షనేతను కలిగి ఉండడం సీఎం జగన్ దౌర్భాగ్యం అన్నారు. చంద్రబాబు బంద్‌కు పిలుపునిస్తే కనీసం ఒక్క దుకాణారుడైనా స్వచ్ఛందంగా దుకాణం మూసివేశారా?.. కుటుంబ వ్యాపార సంస్థల్లోనూ బంద్‌ను పాటించే పరిస్థితి ఉందా? అని విమర్శించారు.