Free Bus | మహిళలకు ఉచిత బస్సు పథకంపై మంత్రి పార్థసారధి కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాదిలోనే ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించిన అంశాలపై నిర్వహించిన మీడియా సమావేశంలో పార్థసారథి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ బడ్జెట్ ప్రవేశ పెట్టిందని తెలిపారు.
గత ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని.. వ్యవస్థలను ధ్వంసం చేసి పరిపాలన అస్తవ్యస్తం చేసిందని పార్థసారథి మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వైసీపీ సర్కార్ చిన్నాభిన్నం చేసిందని విమర్శించారు. గత వైసీపీ సర్కార్ రూ.1.35 లక్షల కోట్ల మేర బకాయిలు పెట్టి వెళ్లిపోయిందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ప్రకారం సూపర్ సిక్స్ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని పార్థసారథి అన్నారు. ఇచ్చిన హామీ మేరకు అన్ని పథకాలు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇప్పటికే రెండు ప్రధాన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పింఛన్లను రూ.3 వేల నుంచి 4 వేలకు పెంచామని తెలిపారు. ఉచిత గ్యాస్ అమలులో భాగంగా రూ.840 కోట్ల నిధులను మంజూరు చేశామని పేర్కొన్నారు. మరో రెండు పథకాల అమలు కోసం ఈ బడ్జెట్లో నిధులు కేటాయించామని అన్నారు. తల్లికి వందనం పథకానికి ఈ బడ్జెట్లోనే నిధులు కేటాయించామనిచెప్పారు. దీపం పథకాన్ని ఇప్పటికే అమలు చేశామన్నారు.