AP News | మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. రావణాసురుడు రామాయణం చెప్పినట్లుగా వైఎస్ జగన్ మాటలు ఉన్నాయని విమర్శించారు. జగన్కు చేసిన తప్పులు పగలు-రాత్రి గుర్తొస్తుండటంతో ఎక్కడ ఎరుపు రంగు కనిపించినా రెడ్ బుక్కే గుర్తుకొస్తుందని అన్నారు. కక్షలు, వేధింపులు, అరాచకాలు, హింస పేర్లు వింటే అందరికీ జగనే గుర్తుకొస్తాడని మండిపడ్డారు.
ప్రజా తీర్పు ఓర్వలేను అన్నట్లుగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని వైఎస్ జగన్పై మంత్రి నిమ్మల విమర్శించారు. నంద్యాల ఘటనలో ఎస్సీల భూమిని వైసీపీ నేత కబ్జా చేశారని ఆరోపించారు. గ్రామ పెద్ద వైసీపీ నేత నారప్ప రెడ్డికి భూమి తిరిగి ఇవ్వమని చెప్పడంతో అతనిపై దాడి చేయించారని చెప్పారు.
రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవను వ్యక్తిగత స్వార్థం కోసం జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి నిమ్మల మండిపడ్డారు. వినుకొండ ఘటనలో అసత్యాలు ప్రచారం చేయడంలో విఫలమై భంగపడిన రీతిలో ఇవాళ నంద్యాలలోనూ జగన్ బోల్తా పడ్డారని విమర్శించారు. శాంతి భద్రతల నిర్వహణలో టీడీపీ ప్రభుత్వం ఎక్కడా రాజీపడదని జగన్ గుర్తించాలని స్పష్టం చేశారు.