AP News | మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. అబద్దాలు ఆడటంలో అంబటి రాంబాబుది అందె వేసిన చేయి అని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించినట్లు ఆధారాలు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. నిద్రపోయే వాణ్ణి లేపవచ్చు. నిద్ర నటించే వాణ్ణి ఎవరు లేపగలరు అని వ్యాఖ్యానించారు. అలాగే అంబటికి అన్నీ తెలుసు. అయినా వాళ్ల పార్టీ అధినేత మెప్పుకోసం ఆయన చెప్పిన అబద్ధాలనే ఈయన పదేపదే చెబుతున్నారని విమర్శించారు. అబద్ధాలు ఆడటంలో అంబటిది అందె వేసిన చేయి అని పునరుద్ఘాటించారు.
పోలవరం ఎత్తు తగ్గిస్తున్నట్లు అసలు మీకు ఎవరు చెప్పారు.. ఎప్పుడు చెప్పారని అంబటి రాంబాబును నిమ్మల రామానాయుడు నిలదీశారు. మీ దగ్గర ఆధారాలు ఉంటే బహిర్గతపరచండి అని డిమాండ్చేశారు. మాకు తెలియకుండా మీ వైసీపీ నేతలకు మాత్రమే పంపారా అని అడిగారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లకు పెంచి పూర్తి చేస్తామని నేను చెబితే సరిపోదా.. ప్రధాని మోదీ, కేంద్ర జల శక్తి మంత్రితో చెప్పించాలని అనడానికి మీకు అసలు సిగ్గుందా అని మండిపడ్డారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ రెండు కూడా ఎన్డీఏ ప్రభుత్వాలే అని తెలిపారు. మాది డబుల్ ఇంజన్ సర్కార్.. ఆ విషయం గుర్తేరిగి మాట్లాడండి అని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది ఒకటే మాట, ఒకటే బాట అని చెప్పారు.
ఏపీ సీఎం చంద్రబాబుకి పోలవరం, అమరావతి రెండు కళ్లు అని నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రగతి, సంక్షేమం ఆయనకు సమప్రాధాన్యమని అన్నారు. అందువల్ల పోలవరాన్ని సాంకేతిక సలహా మేరకు ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుపై మాకు 100 కు 150 శాతం చిత్తశుద్ధి ఉందన్నారు. పోలవరం అవశ్యకత మీకంటే మాకు బాగా తెలుసు అని చెప్పారు. ప్రాజెక్టు ఎత్తుని 41.15 మీటర్లకు కుదించేలా చంద్రబాబు కేంద్రంతో రహస్య ఒప్పందం చేసుకుని ఆ విషయం గోప్యంగా ఉంచినట్టు అంబటి ఆరోపించడం చూస్తే ఆయన మానసిక పరిస్థితి మీద డౌట్ వస్తుందని అన్నారు. అక్టోబర్ 9న ఇచ్చిన రూ. 2348 కోట్లు మళ్ళించామనడం ఇదొక తప్పుడు ఆరోపణ అని అన్నారు. దీన్ని నిరూపించే దమ్ముందా అని సవాలు విసిరారు. పోలవరం ప్రాజెక్టును నిర్దేశిత సాంకేతిక ప్రమాణాల మేరకు నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. ఆంధ్రుల అభిమానాన్ని శాశ్వతంగా చూరగొంటామన్నారు. ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటాం.. మీరు అబద్ధాలు మానేయండని చెప్పారు. డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని సూచించారు. మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసిన మసక బారిన మీ పార్టీ బతికి బట్ట కట్టడం కష్టమని అన్నారు..