Nara Lokesh | ప్రజా సమస్యలు, వినతులపై ఇక నుంచి తనకు వాట్సాప్ చేయవద్దని ఏపీ మంత్రి నారా లోకేశ్ సూచించారు. ప్రజల నుంచి వరదలా వచ్చిన మెసేజ్‌లతో సాంకేతిక సమస్యలు వచ్చి తన వాట్సాప్ అకౌంట్‌ను మెటా బ్లాక్ చేసిందని తెలిపారు. ఏమైనా సమస్యలు ఉన్నా.. సహాయం కావాలన్నా ఇకనుంచి తన పర్సనల్ మెయిల్ ఐడీకి మాత్రమే పంపించాలని రిక్వెస్ట్ చేశారు.
పాదయాత్రలో యువతకు తనను చేరువ చేసిన హలో లోకేశ్ కార్యక్రమం పేరుతోనే ఒక మెయిల్ ఐడీని క్రియేట్ చేసుకున్నానని నారా లోకేశ్ తెలిపారు. hello.lokesh@ap.gov.in మెయిల్ ఐడీ ద్వారానే తనకు సమస్యలు, వినతులను పంపించాలని ప్రజలకు సూచించారు. మీ పేరు, ఊరు, మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ, సమస్య లేదా సహాయానికి సంబంధించిన పూర్తి వివరాలను మెయిల్లో పేర్కొనాలని చెప్పారు. మీకు సహాయం చేయడం, సమస్య పరిష్కరించే బాధ్యతను తానే స్వయంగా తీసుకుంటానని స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే నారా లోకేశ్ ప్రజా సమస్యలపై దృష్టి సారించారు. ఉండవల్లిలోని తన నివాసంలో రోజూ ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే వాట్సాప్‌లో కూడా వినతులు తీసుకుంటున్నారు. అయితే ఫిర్యాదులు, వినతులకు సంబంధించి తెలియని నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లు ఎక్కువ కావడంతో నారా లోకేశ్ వాట్సాప్ బిజినెస్ అకౌంట్ తరచూ బ్లాక్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే మెయిల్ ద్వారానే వినతులు స్వీకరించాలని నారా లోకేశ్ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని తన ట్విట్టర్ (ఎక్స్) ఖాతా ద్వారా ప్రజలకు తెలియజేశారు.