Mega DSC | మెగా డీఎస్సీపై ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. వచ్చే విద్యాసంవత్సరం నాటికి డీఎస్పీ ప్రక్రియను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం నారా లోకేశ్ శాసనసభలో మాట్లాడుతూ.. 1994 నుంచి డీఎస్సీల నిర్వహణపై ఆరా తీస్తున్నామని చెప్పారు. అనేక సార్లు కోర్టుల్లో వివాదాలతో ఆలస్యమైన నేపథ్యంలో వాటిని పరిష్కరించే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి న్యాయపరమైన సమస్యల్లో చిక్కుకోకుండా వాటన్నింటినీ నిరోధించేలా డీఎస్పీ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.
ఏపీలో ఎప్పటి నుంచో ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని నారా లోకేశ్ తెలిపారు. కానీ గత ఐదేళ్లలో వైసీపీ ఒక్కసారి కూడా డీఎస్పీ నియామకాలు చేపట్టలేదని, ఒక్క టీచర్ ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదని మండిపడ్డారు. హడావుడిగా ఎన్నికల సమయంలో ఫిబ్రవరి 12వ తేదీన డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారని తెలిపారు. అది కూడా 6100 పోస్టులకే నోటిఫై చేశారని.. ఆ తర్వాత దాని ప్రక్రియను కూడా పట్టించుకోలేదని విమర్శించారు. టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల్ని వైసీపీ దారుణంగా మోసం చేసిందని, అలాంటి మోసాలకు తావు లేకుండా నిర్దిష్టమైన ప్రణాళికతో మెగా డీఎస్సీతో ముందుకొస్తామని తెలిపారు. అలాగే వయసు పరిమితిపై కూడా ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ మోడల్ ఎడ్యుకేషన్లో ఉపాధ్యాయుల్ని భాగస్వామ్యం చేస్తామని నారా లోకేశ్ తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధితో ఉన్నామని తెలిపారు. వారిని వేధిస్తున్న జీవో నెంబర్ 177కు ప్రత్యామ్నాయంగా మరో జీవో తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. టీచర్ల కోసం తమ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు విద్యపై మాత్రమే దృష్టి పెట్టేలా ప్రణాళికలు వేస్తున్నామని చెప్పారు. ఉపాధ్యాయులపై గత ప్రభుత్వం పెట్టిన కేసులపై డీజీపీతో చర్చిస్తున్నామని, వాటిని కూడా ఎత్తివేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు.