Nara Lokesh | ఆటోల వెనుక ఉండే కొటేషన్లపై ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ ఆటోల వెనుక ఉండే కొటేషన్లను చదువుతుంటానని చెప్పారు. అవి చదువుతుంటే వారి మనసు ఏంటో అర్థమవుతుందని అన్నారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఆటోడ్రైవర్ల సేవలో పథకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ.. ఆటోల వెనుక ఉన్న కొటేషన్లు చదువుతుంటానని తెలిపారు. అలాగే తనకు నచ్చిన కొన్ని కొటేషన్లను తెలిపారు. ‘ వర్షం ఎలా వస్తుందని పిల్లలు అడిగితే దేవుడు కురిపిస్తాడు అని చెప్పొద్దు.. మొక్క నాటితే దానివల్ల వర్షం కురుస్తుందని చెప్పండి’ అని ఒక కొటేషన్ చదివానని తెలిపారు. ఆ కొటేషన్ ద్వారా ప్రకృతిపై ప్రేమను పెంపొందించేందుకు తనవంతు ప్రయత్నం చేశాడని తెలిపారు. ‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’, ‘జర భద్రం భయ్యా.. మనందరం చల్లగా ఇంటికెళ్లాలి’ అనే కొటేషన్లు కూడా సమాజం పట్ల వారి బాధ్యతను తెలుపుతున్నాయని అన్నారు. ఇక కొన్ని కామెడీ కొటేషన్లను కూడా తాను చదివానని తెలిపారు. ‘ అప్పు చేసి కొన్నా.. నన్ను చూసి ఏడవద్దు’, ‘ హాయ్ అని ఆశపెట్టొద్దు.. బాయ్ అని బాధ పెట్టొద్దు’ అనే కొటేషన్లు తనకు నవ్వు తెప్పించాయని పేర్కొన్నారు. ఇక ఆటో డ్రైవర్లు సమాజం పట్ల ఎంతో బాధ్యతతో ఉంటారని.. ఎవరైనా ఆటోలో ఏదైనా మరిచిపోతే పోలీసులకు అప్పగిస్తారని తెలిపారు.
యువగళం పాదయాత్ర సమయంలో ఆటో డ్రైవర్లతో తాను ప్రత్యేకంగా మాట్లాడానని చంద్రబాబు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. గతంలో కుడి చేత్తో రూ.10వేలు ఇచ్చి.. గ్రీన్ ట్యాక్స్ పేరుతో రూ.20వేలు లాగేసేవారని విమర్శించారు. గుంతల రోడ్లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని చెప్పారు. అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు ముందుకొచ్చామని తెలిపారు. కూటమి ప్రభుత్వం రాగానే గ్రీన్ ట్యాక్స్ తగ్గించామని తెలిపారు. రూ.2వేల కోట్లు ఖర్చు పెట్టి గుంతలు మరమ్మతులు చేశామని పేర్కొన్నారు. పేదవాడి కారు ఆటో.. చిన్న పిల్లలు స్కూలుకు వెళ్లేది ఆటోలోనే.. బస్సు, రైలు ఎక్కాలన్నా ఉండాల్సింది ఆటోలే అని నారా లోకేశ్ వ్యాఖ్యానించారు.
ఆటోల వెనుక ఉన్న కొటేషన్లు చదువుతూ ఉంటా. కొటేషన్లు చూస్తుంటే వారి మనస్సు ఏంటో అర్థమవుతోంది. ఆటోలో ఏ వస్తువు మరచిపోయినా పోలీసులకు ఇస్తారు. ఎన్ని సమస్యలు ఉన్నా ఆటో డ్రైవర్లు నవ్వుతూ ఆదరిస్తారు.#AutoDriverlaSevalo#Super6SuperHit#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#NaraLokesh… pic.twitter.com/4wzaKSsMDh
— Telugu Desam Party (@JaiTDP) October 4, 2025