Botsa Satyanarayana | రాజకీయాల్లో మాట నెగ్గాలంటే అధికారం ఉండాలి. అధికారం ఉంటేనే అన్నది చెల్లుతుంది.. ఎవరైనా చెప్పిన మాట వింటారు. అలాంటిది ప్రతిపక్షంలో ఉన్న నాయకుడి కాళ్లను అధికారంలో ఉన్న ఒక మంత్రి మొక్కుతారా? కానీ ఉత్తరాంధ్రలో ఇలాంటి ఘటనే జరిగిందన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది. వైసీసీ సీనియర్ నాయకుడు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత అయిన బొత్స సత్యనారాయణ కాళ్లను గజపతినగరం MSME, NRI సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పట్టుకున్నారన్న ప్రచారం రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే ఇదంతా పచ్చి అబద్ధం.. ఫేక్ ప్రచారమని టీడీపీ నాయకులు చెబుతున్నారు.
రెండు రోజుల కిందట వైజాగ్ ఎయిర్‌పోర్టులో బొత్స సత్యనారాయణ, కొండపల్లి శ్రీనివాస్ ఎదురుపడ్డారు. అప్పటికే ఎయిర్‌పోర్టు లాంజ్‌లో బొత్స కూర్చుని ఉండగా.. అక్కడికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వచ్చారు. బొత్సను చూడగానే కొండపల్లి శ్రీనివాస్ అభిమానంతో ఆయన దగ్గరకు వెళ్లారు. వెంటనే బొత్స కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సంఘటన చూసి అక్కడున్న మిగతా ఎమ్మెల్యేలు ఒక్కసారిగా షాకయ్యారు. ఇదేంటని వారు మంత్రిని ప్రశ్నిస్తే.. బొత్స తనకు గురువులాంటి వ్యక్తి అని.. తమది రాజకీయాలకు అతీతమైన బంధమని చెప్పినట్లుగా ఒక ప్రచారం జరుగుతోంది. ఇది చూసి తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారని పెద్ద ఎత్తున దుమారం రేగింది.
బొత్స కాళ్లను మంత్రి మొక్కారనేది అబద్ధమని.. కావాలనే కొందరు వైసీపీ నాయకులు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌పై అసత్యప్రచారం చేస్తున్నారని టీడీపీ నాయకులు అంటున్నారు. కేవలం మంత్రి పరువును తీయడానికే ఇలా అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఉత్తరాంధ్ర నుంచి రాజకీయాల్లోకి వచ్చి యంగ్ మినిస్టర్‌గా మంచి పేరు తెచ్చుకుంటుండటంతో గిట్టని బొత్స సత్యనారాయణ వర్గీయులు ఇలా తప్పుడు ప్రచారానికి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే బొత్స సత్యనారాయణను కొండపల్లి శ్రీనివాస్ కలిసి ఉంటే.. దానికి సంబంధించిన ఫుటేజ్‌ను బయటపెట్టాలని మంత్రి అనుచరులు సవాలు చేస్తున్నారు.
ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేతల్లో బొత్స సత్యనారాయణ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర రాజకీయాలను బొత్స ప్రభావితం చేస్తున్నారు. 1994లో కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన వైఎస్ఆర్ చనిపోయే దాకా అందులోనే కొనసాగారు. పీసీసీ చీఫ్‌గా, మంత్రిగా వివిధ బాధ్యతలను నిర్వర్తించారు. వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్‌కు తోడుగా వైసీపీలోకి వెళ్లిన ఆయన.. ఆ పార్టీలో కూడా చక్రం తిప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం పొందినప్పటికీ.. బొత్సకు జగన్ ప్రియారిటీ ఇచ్చారు. ఎమ్మెల్సీని చేయడంతో పాటు శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఇక మంత్రి కొండపల్లి శ్రీనివాస్ టీడీపీ కంటే ముందు వైసీపీలోనే ఉన్నారు. ఎన్నికలకు రెండు నెలల ముందే వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వైసీపీలో ఉన్నప్పుడు వీరిద్దరి మధ్య ఉన్న పరిచయాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది ఇలాంటి ఫేక్ ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది.