కొన్ని రోజులుగా నెల్లూరు జిల్లాలో రగులుతున్న రాజకీయ రచ్చపై వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్ స్పందించారు. అటు అనిల్ యాదవ్‌తో గానీ, ఎమ్మెల్యే కోటంరెడ్డితో గానీ.. తనకు ఎలాంటి విభేదాలు లేవని తేల్చి చెప్పారు. తాను అందరితో కలిసిపోతానని తెలిపారు. తమ మధ్య విభేదాలుంటే విద్రోహులు ప్రవేశిస్తారని పరోక్షంగా టీడీపీ నేతలపై మండిపడ్డారు. తాను ఇచ్చిన సహకారం కంటే తనకు డబుల్ సహకారం ఇస్తానని మాజీ మంత్రి అనిల్ యాదవ్ ప్రకటించారని, అందులో తప్పేముందని ఎదురు ప్రశ్నించారు. అయితే వివాదాస్పద విషయాలను బయట, విలేకరుల ముందు మాట్లాడనని, పార్టీ వేదికలపైనే మాట్లాడతానని స్పష్టం చేశారు. తమందరి లక్ష్యం ఒక్కటేనని , 2024 ఎన్నికల్లో తిరిగి వైసీపీని అధికారంలోకి తీసుకురావడమే అతిపెద్ద టాస్క్ అని మంత్రి కాకాణి ప్రకటించారు.
సీబీఐతో విచారణ చేయించండి… కాకాణి
నెల్లూరు కోర్టులో జరిగిన దొంగతనంతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని మంత్రి కాకాణి ప్రకటించారు. దీనిపై ఏ విచారణకైనా తాను సిద్ధమని ప్రకటించారు. తనపై విమర్శలకు దిగుతున్న వారు సీబీఐతో విచారణ చేయించాలని, లేదంటే హైకోర్టుతోనైనా విచారణ చేయించాలని, దేనికైనా తాను సిద్ధమని తేల్చి చెప్పారు. టీడీపీ నేత సోమిరెడ్డి 2017 లోనే తనపై కేసు పెట్టారని, టీడీపీ హయాంలో రెండు సార్లు ఛార్జిషీట్ వేస్తే సరైంది కాదని కోర్టే పేర్కొందని గుర్తు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఛార్జిషీట్ ఫైల్ అయ్యిందని కాకాణి పేర్కొన్నారు.