Duvvada Srinivas | ఏపీలో సంచలనం సృష్టించిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదం మెల్లిగా రాజకీయ రంగు పులుముకుంటున్నది. నిన్న ఆత్మహత్యకు యత్నించిన దివ్వల మాధురి.. దువ్వాడ వాణి చేస్తున్న ఆరోపణల కారణంగా తాను అన్యాయంగా బలికావాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతల సహకారంతోనే వాణి తనపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం పూర్తిగా ఆయన వ్యక్తిగత విషయమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ఆయన్ను తామెక్కడా విమర్శించడం లేదని తెలిపారు. తమను ఇబ్బందులు పెట్టిన వైసీపీ ముఖ్య నేతల పట్ల తాము కక్షపూరితంగా వ్యవహరించడం లేదని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు కావాలనే తమపై బురదజల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో తమను దోషులుగా చూపించాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని పేర్కొన్నారు.
తిరుపతిలో మీడియాతో మాట్లాడిన మంత్రి గొట్టిపాటి రవికుమార్.. తమ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను తగ్గించే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. కొత్త విద్యుత్ ఉత్పత్తి తీసుకురాకపోవడం వల్ల గతంలో విద్యుత్ ఛార్జీలు పెరిగాయని అన్నారు. 24 గంటల పాటు వినియోగదారులకు విద్యుత్‌ను అందిస్తామని తెలిపారు. రైతులకు నాణ్యమైన కరెంటు అందిస్తామని స్పష్టం చేశారు.
కాగా, దివ్వల మాధురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో నిన్న పలాస జాతీయ రహదారిపై యాక్సిడెంట్ చేసినందుకు గానూ ఆమెపై కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో పాటు ఇతరుల ప్రాణాలకు హాని కలిగించేలా వ్యవహరించినందుకు చట్ట ప్రకారం ఆమెపై కేసులు పెట్టారు. నూతన భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 125 కింద ఈ కేసు నమోదైంది.