AP News | ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ విలువలను పెంచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నట్లు ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. తాడేపల్లిలోని ఐజీ ఆఫీసులో రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలపై మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. అభివృద్ధి ఆధారంగా సగటున 15 నుంచి 20 శాతం వరకు రిజిస్ట్రేషన్ విలువలను పెంచే అవకాశం ఉందని చెప్పారు.
రాష్ట్రంలో ఎక్కడెక్కడ గ్రోత్ కారిడార్లు ఉన్నాయో.. ఎక్కడ భూమి రేట్లు బాగా పెరిగాయో అక్కడ మాత్రమే రిజిస్ట్రేషన్ విలువలు పెంచనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గత వైసీపీ పాలనలో రిజిస్ట్రేషన్ విలువల సవరణలో శాస్త్రీయ విధానాన్ని అనుసరించలేదని పేర్కొన్నారు. కొన్నిచోట్ల రిజిస్ట్రేషన్ విలువలను అడ్డగోలుగా పెంచారని చెప్పారు. ఆ విలువలను తగ్గించామని పేర్కొన్నారు.
అసంబద్ధంగా జరిగిన రిజిస్ట్రేషన్ విలువల మార్పులో శాస్త్రీయ కోణంలో సవరిస్తున్నామని అనగాని సత్యప్రసాద్ తెలిపారు. జీపీఎస్ విధానాన్ని కూడా అనుసరిస్తున్నామని చెప్పారు. సవరించిన కొత్త విలువల ప్రతిపాదనలపై రియల్ ఎస్టేట్ సంఘాలు, ఇతర వర్గాల నుంచి వచ్చే అభ్యంతరాలు, వినతులు పరిగణనలోకి తీసుకుంటున్నామని పేర్కొన్నారు. జిల్లా కమిటీలు పేర్కొన్న కొత్త విలువలపై మరోసారి సమీక్షించాలని అధికారులను ఆదేశించామని జనవరి 15వ తేదీ నాటికి తుది ప్రతిపాదనలపై ఉన్నత స్థాయిలో చర్చించి ఖరారు చేస్తామని వెల్లడించారు.