Ambati Rambabu | వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ – జనసేన మధ్య సీట్ల పంపకంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. వాళ్లు సీట్ల కోసం భేటీ అయ్యారో.. నోట్ల కోసం భేటీ అయ్యారో చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ను డిమాండ్ చేశారు. ఆదివారం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీలో ఏమీ తేలదని అన్నారు. తన చిన్నప్పటి నుంచి భేటీ సాగుతూనే ఉందని ఎద్దేవా చేశారు.
టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తారని రెండేండ్ల నుంచి చెబుతున్నారని.. అలాంటిది ఇంకా సీట్ల పంచాయతీ తేల్చుకోలేకపోయారని అంబటి రాంబాబు దుయ్యబట్టారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని సందేహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కుప్పంలోనే పోటీ చేస్తారా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌తో వెళ్తే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లే అని ఎద్దేవా చేశారు. సీట్ల పంపకంలో భాగంగా పవన్‌కు ముష్టి పడేస్తారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. రానున్న ఎన్నికల్లో గెలవడం తమ టార్గెట్ కాదని.. 175 సీట్లు గెలవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్‌లు ఓడిపోవడమే తమ టార్గెట్ అని తెలిపారు. సీఎం జగన్‌ను ఓడించడం మీ వల్ల కాదని.. పేద ప్రజల అండ తమకు ఉందని స్పష్టం చేశారు. కాగా, టీడీపీ – జనసేన అధినేతలు భేటీ కావడంపై అంతకుముందు ట్విట్టర్ (ఎక్స్) ద్వారా స్పందించారు. మోయడానికి ఎందుకులే భేటీలు అని విమర్శించారు. అంతేకాకుండా చంద్రబాబు, నారా లోకేశ్‌ను పవన్ కళ్యాణ్ తన భుజాల మీద మోస్తున్న ఒక కార్టూన్‌ను షేర్ చేశారు.