అమరావతి : ఏపీ హోం మంత్రి (Home Minister) వంగలపూడి అనిత వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా (Roja) పై సంచలన వ్యాఖ్యలు (sensational comments ) చేశారు. అప్పటి మంత్రి రోజా సెల్వమణి తిరుమల వీఐపీ టికెట్లు అమ్ముకుందని ఆరోపించారు. తిరుమల లడ్డూ (Tirumala Laddu) కల్తీ విషయంలో జగన్ పశ్చాతాపం పడకుండా ఇంకా బుకాయిస్తున్నారని ఆరోపించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు.
ఐదేండ్లలో లడ్డూ పరిమాణం, నాణ్యత, రుచి తగ్గిన మాట వాస్తవమేనని భక్తులు అనేక సార్లు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు.ఎంతో నమ్మకం, పవిత్రమైన తిరుమల వేంకటేశ్వరస్వామిని కొలిచినట్టుగానే అంతే పవిత్రత గల లడ్డూలో కల్తీకి పాల్పడి నిర్వీర్యం చేశారని ఆరోపించారు. తిరుమలలో జరిగిన అక్రమాలపై శాఖాపరమైన విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దాని గురించి వైఎస్ జగన్ మాట్లాడకుండా కొత్తగా వందరోజుల పాలన వైఫల్యాలు అంటూ తప్పదోవ పట్టించారని పేర్కొన్నారు.
తిరుమల స్వామివారిని రాజకీయాల్లోకి జగన్ లాగడం దుర్మార్గమని అన్నారు. తిరుమల దైవంతో పెట్టుకున్నందుకే వైసీపీకి 11 సీట్లు వచ్చాయని దుయ్యబట్టారు. ఇలాగే ప్రవర్తిస్తే జగన్ పులివెందులలో కూడా ఓడిపోతారని తెలిపారు. వందరోజుల పాలనపై , తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపైనా చర్చకు దమ్ము, ధైర్యముంటే బహిరంగ చర్చకు రావాలని జగన్కు సవాలు విసిరారు.