నెల్లూరు పర్యటన సందర్భంగా ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. మంత్రుల ఇళ్లపైకి వైసీపీ నేతలను పంపిస్తే ఎలా ఉంటుందని జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడటమేంటని మండిపడ్డారు. ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
జగన్ ఎంత రెచ్చగొట్టినా తమ తొలి ప్రాధాన్యం పాలనకేనని వంగలపూడి అనిత స్పష్టం చేశారు. గతంలో జగన్ తనకు భద్రత కల్పించడం లేదని చెప్పారని అన్నారు. ఇప్పుడేమో తనను అభిమానులు కలవనీయకుండా చేస్తున్నారంటున్నాడని అన్నారు. కార్యక్రమం కోసం అనుమతి ఇచ్చి పోలీసులు అందుకు అనుగుణంగానే భద్రత కల్పిస్తారని స్పష్టం చేశారు. ఏపీలో శాంతి భద్రతల సమస్య ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో గత ఐదేళ్ల పాటు జగన్.. ఎమర్జెన్సీ పరిస్థితులు కల్పించారని విమర్శించారు. అధికారంలోకి వస్తే తప్పు చేసిన అధికారులను వదలమని జగన్ చెబుతున్నది వార్నింగ్ కాదు.. సినిమా డైలాగ్ మాత్రమేనని వ్యాఖ్యానించారు.
వైఎస్ జగన్ ప్రాంతానికో మాట మాట్లాడే వ్యక్తి అని వంగలపూడి అనిత విమర్శించారు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లడం ద్వారా జగన్ ఏ మెసేజ్ ఇస్తున్నారని జగన్ను ప్రశ్నించారు. మహిళను కించపరిచిన వ్యక్తిని పరామర్శించడం సరికాదని హితవు పలికారు. జగన్ అంతగా ఓదార్చాలంటే మొదట షర్మిల, విజయమ్మను ఓదార్చాలని సెటైర్లు వేశారు. జగన్ పరామర్శ యాత్ర చేపడితే మొదట షర్మిల ఇంటి నుంచి మొదలు పెట్టాలని సూచించారు. లిక్కర్ స్కాం కేసులో చట్టం తన పని తాను చేసుకునిపోతుందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు.