Vijayasai Reddy | విజయసాయిరెడ్డి రాజీనామాపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత సెటైర్లు వేశారు. విజయసాయి రెడ్డికి గొడ్డలి కలలోకి వచ్చిందేమో.. అందుకే భయపడి రాజీనామా చేసి ఉండొచ్చని విమర్శించారు. రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా చేసిన తప్పునకు శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు.
విశాఖ జువైనల్ హోమ్‌ను శనివారం నాడు వంగలపూడి అనిత పరిశీలించారు. పిల్లలను రక్షించే బాధ్యత ప్రభుత్వానిదేనని.. దీన్ని ఎవరో గుర్తుచేయాల్సిన అవసరం లేదని అన్నారు. వైసీపీ ట్విట్టర్ (ఎక్స్)లో చేసిన పోస్టుల్లో 80 శాతం అవాస్తవాలే అని పేర్కొన్నారు. గత ఐదేళ్లు అబద్ధాలతో గడిపేశారని.. ఇప్పుడు కూడా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని.. తప్పు చేసిన వాళ్లకు కచ్చితంగా శిక్ష పడుతుందని స్పష్టం చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ దావోస్ పర్యటనకు వెళ్లి.. రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి కూడా తీసుకురాలేదని వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలపైనా వంగలపూడి అనిత స్పందించారు. గత ఐదేళ్లలో దావోస్‌లో నాలుగుసార్లు సమ్మిట్ జరిగితే ఒక్కసారి మాత్రమే వెళ్లొచ్చారని జగన్‌ను విమర్శించారు. తిరునాళ్లలో తప్పిపోయిన పిల్లాడిలా బిత్తర చూపులు చూస్తూ.. ఇట్స్ లెంగ్త్ క్వశ్చన్ అని అన్నారని చెప్పారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కాబట్టే.. పెట్టుబడులు రావడం లేదని మాజీ మంత్రి రోజా చేసిన విమర్శలపైనా ఆమె స్పందించారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తే.. వైసీపీ వాళ్లు ఈ 7 నెలల్లో రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి ఉండేది కాదని అన్నారు.