Vangalapudi Anitha | ఏపీలో మహిళలపై జరుగుతున్న నేరాలకు హోం మంత్రిగా బాధ్యత స్వీకరించాలని.. లేదంటే తానే హోంమంత్రిగా బాధ్యత తీసుకోవాల్సి వస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వంగలపూడి అనిత స్పందించారు. ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల్లో ఎటువంటి తప్పూ లేదని స్పష్టం చేశారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా పోలీసు అధికారులతో ఏపీ హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ ఏ కేసు విషయంలో అంత ఆగ్రహంతో మాట్లాడారో తెలుసని.. త్వరలోనే దాని గురించి ఆయనతో మాట్లాడతానని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ మాటలను బాధ్యతగా తీసుకొని కలిసి పనిచేస్తామని స్పష్టంచేశారు.
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, గంజాయి వంటి అంశాలను ఏ మాత్రం ఉపేక్షించేది లేదని అనిత స్పష్టం చేశారు. నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించామని తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లాలో జరిగిన గ్యాంగ్ రేప్ బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై గతంలోనే చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఇలాంటివి జరిగేవి కావని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న నేరాల విషయంలో అందరికీ ఆందోళన ఉందని అన్నారు. ఈవిషయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాత్రం బయటపడ్డారని.. తాము బయటపడలేదని చెప్పుకొచ్చారు.
లా అండ్ ఆర్డర్ పకడ్బందీగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని అనిత తెలిపారు. శిక్షలు తక్షణమే అమలు చేయడానికి ప్రత్యేక కోర్టులు కావాలని.. దీన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. సోషల్మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నవారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.