నెల్లూరు రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోలు వ్యవహారంలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రమేయం ఉందని తెలిసింది. తీవ్రమైన నేరాల్లో శిక్ష పడిన జీవిత ఖైదీకి పెరోలు మంజూరు చేయడం సాధ్యం కాదని హోం శాఖ జాయింట్ సెక్రటరీ కేవీ కిశోర్ కుమార్ తిరస్కరించినప్పటికీ.. హోం మంత్రి అనిత ఒత్తిడి చేయడం వల్లే పెరోలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వైసీపీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పలు ఆధారాలను పేర్కొంది.
వైసీపీ తన ట్విట్టర్లో పేర్కొన్న దాని ప్రకారం.. ‘శ్రీకాంత్ పెరోలు మంజూరు కోసం నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పాశం సునీల్ కుమార్‌లు హోం శాఖ జాయింట్ సెక్రటరీ కేవీ కుమార్‌కు సిఫారసు చేశారు. కానీ తీవ్రమైన నేరాలకు పాల్పడి జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తుండటంతో పాటు, గతంలో ఒకసారి జైలు నుంచి పరారయ్యాడనే కారణంతో శ్రీకాంత్‌కు పెరోలు ఇవ్వకూడదని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా శ్రీకాంత్ పెరోలు మంజూరు ప్రతిపాధనను హోం శాఖ జాయింట్ సెక్రటరీ తిరస్కరించారు. ఈ మేరకు జూలై 16వ తేదీన అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.
‘ అని వైసీపీ పేర్కొంది. ఆ ఉత్తర్వులను కూడా ట్విట్టర్(ఎక్స్)లో పోస్టు చేసింది.
శ్రీకాంత్ పెరోలుకు హోం శాఖ జాయింట్ సెక్రటరీ తిరస్కరించడంతో టీడీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పాశం సునీల్‌కుమార్ చక్రం తిప్పారని వైసీపీ ఆరోపించింది. ఎలాగైనా శ్రీకాంత్‌కు పెరోలు మంజూరు చేయించాలని హోంమంత్రి అనితపై వారు ఒత్తిడి తీసుకొచ్చారని తెలిపింది. ఈ క్రమంలోనే శ్రీకాంత్ ప్రియురాలు అరుణతో మంత్రికి డీల్ కుదిర్చారని.. డీల్ ఓకే కావడంతో పెరోలు మంజూరు చేయాలని ఆదేశిస్తూ హోంమంత్రి అనిత స్వయంగా నోట్‌ఫైల్‌పై సంతకం పెట్టారని చెప్పింది. ఆ ఫైల్ హోం శాఖ కార్యదర్శి కుమార్ విశ్వజీత్ వద్దకు వెళ్లిందని.. హోంమంత్రి ఒత్తిడి నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో శ్రీకాంత్‌కు పెరోలు మంజూరు చేస్తూ జూలై 30వ తేదీన జీవో జారీ చేశారని వెల్లడించింది. ఈ మేరకు ఇంటెలిజెన్స్ వర్గాలు సీఎంవోకు నివేదిక సమర్పించినట్లు సమాచారం.
Parole