అమరావతి: ఏపీ సర్కార్‌కు అక్కడి హైకోర్టు మరోసారి మొట్టికాయ వేసింది. ఈ సారి ఓ సలహాదారు నియామకం గురించి మొట్టికాయ వేయడం విశేషం. అంతటితో ఆగకుండా ఆయన నియామకంపై స్టే కూడా విధించింది. శ్రీకాంత్ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు.. ఈ సందర్భంగా ఏపీ సర్కార్‌పై కీలక వ్యాఖ్యలు కూడా చేసినట్లుగా తెలుస్తున్నది.
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ సలహాదారుగా జ్వాలాపురం శ్రీకాంత్ నియామకంపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. శ్రీకాంత్‌ను సలహాదారుగా నియమించడం పట్ల దాఖలైన పలు పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారించి ఈ మేరకు స్టే అమలుచేసింది. శ్రీకాంత్ నియామకంపై ఘాటుగా స్పందించిన హైకోర్టు.. దీన్ని ఇలాగే వదిలేస్తే రేపు అడ్వకేట్ జనరల్‌కు కూడా సలహాదారును నియమిస్తారు అంటూ వ్యాఖ్యానించడం కలకలం రేపింది. సలహాదారులను నియమించేందుకు అవసరమేంటి అని కూడా ప్రశ్నించినట్లు తెలుస్తున్నది. ఇదే సమయంలో మంత్రులకు సలహాదారులు ఉన్నరంటే ఓకే కానీ, ప్రభుత్వ శాఖలకు సలహాదారులేంటి? అని ప్రశ్నించినట్లు సమాచారం. వెంటనే శ్రీకాంత్ సలహాదారుగా నియమించడంపై స్టే విధిస్తున్నట్లు హైకోర్టు పేర్కొన్నది.
అనంతపురం జిల్లాకు చెందిన జ్వాలాపురం శ్రీకాంత్‌ను దేవాదాయ శాఖ సలహాదారుగా ప్రభుత్వం నియమిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాంత్ ఏపీ బ్రాహ్మణ సేవా సంఘాల సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్నారు. గతంలో టీడీపీలో కొనసాగిన శ్రీకాంత్.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఓ స్వామీజి సూచనల మేరకు శ్రీకాంత్‌కు సలహాదారు పదవి వరించినట్లు అనంతపురం జిల్లాలో చర్చించుకుంటున్నారు. వాస్తవానికి దేవాదాయ శాఖలో సలహాదారు పదవి అనేది లేనప్పటికీ.. ప్రభుత్వం ఈయన కోసమే సృష్టించి మరీ నియమించినట్లుగా రాష్ట్రానికి చెందిన రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు.