Vijayawada Utsav | విజయవాడ ఉత్సవ్ నిర్వహణకు ఏర్పడిన అడ్డంకులు తొలగిపోయాయి. విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో గొడుగుపేట వేంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన భూముల విషయంలో హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై సీజే ధర్మాసనం స్టే ఇచ్చింది.
దేవాదాయ భూముల్లో విజయవాడ ఉత్సవ్ నిర్వహించడంపై దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. దేవాదాయ భూములను వాణిజ్య అవసరాలకు ఉపయోగించవద్దని ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు ఎలా ఉపయోగిస్తారని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. ఆలయ భూముల్లోకి తరలించిన గ్రావెల్, మట్టి, కంకరను వెంటనే తొలగించాలని ఆదేశించింది. ఈ భూములను మళ్లీ యథాస్థితికి తీసుకురావాలని సూచించింది.
హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ విజయవాడ ఉత్సవ్ నిర్వాహకులైన సొసైటీ ఫర్ వైబ్రంట్ విజయవాడ సంస్థ డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.