AP News | జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సుభాష్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఏపీ రాజధాని అమరావతిపై ఫేస్బుక్లో వివాదాస్పద పోస్టు పెట్టినందుకుగానూ ఆయన్ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. వాణిజ్య పన్నుల శాఖ తిరుపతి ప్రాంతీయ ఆడిట్, ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్ (FAC)గా సిద్ధార్థి సుభాష్ చంద్రబాస్ పనిచేస్తున్నారు. ఎప్పుడూ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే సుభాష్.. ఇటీవల రాజధాని అమరావతిపై ఫోస్బుక్లో వివాదాస్పదమైన పోస్టు పెట్టారు. రాజధానిలో శాఖమూరు, నీరుకొండ, కృష్ణాయపాలెంలో సీఆర్డీఏ రిజర్వాయర్ల నిర్మించనుందంటూ వచ్చిన ఓ వార్తను ఆయన ట్యాగ్ చేశారు. ‘ అమరావతి కోసం 3 రిజర్వాయర్లు ఎందుకు? అమరావతినే ఒక రిజర్వాయర్‌గా కడితే పోలా? అసలే ఏడాదికి మూడు పంటలు పండే నేల, రిజర్వాయర్ నీళ్లతో పుష్కలంగా ఉండదా’ అంటూ వ్యంగ్యంగా పోస్టు పెట్టారు. దాని తర్వాత ‘ఒకే ఒక్క వర్షం, అమరావతి జలమయం అంటూ పోస్టు చేయడమే కాకుండా, దాన్ని నమ్మించేందుకు నీరుకొండ-పెదపరిమి మధ్య నీట మునిగిన పంట పొలాల ఫొటోను పోస్టు చేశారు.
అమరావతి మునిగిపోయిందంటూ సుభాష్ చేసిన పోస్టులను పలువురు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రాంతాల ప్రజలకు అమరావతిపై ద్వేషం పెంచేలా కామెంట్స్ చేస్తూ, పోస్టులు పెడుతున్నారని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఏపీ ప్రభుత్వం.. పోస్టులపై వివరణ ఇవ్వాలని సుభాష్‌ను కోరింది. అందుకు అది తన వ్యక్తిగత అభిప్రాయమని సుభాష్ వివరణ ఇచ్చారు. ఆయన సమాధానం పట్ల సంతృప్తి చెందని కూటమి ప్రభుత్వం.. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.