Fact Check | కిలో అరటి పండ్లు కేవలం 50 పైసలు మాత్రమేనని.. ఏపీలో అరటి రైతుల కష్టాలను వివరిస్తూ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన ట్వీట్‌పై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఆ వార్తలను ఖండించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ విభాగం ట్విట్టర్ (ఎక్స్) వేదికగా వివరణ ఇచ్చింది. కిలో అరటిపండ్లు కేవలం 50 పైసలకు మాత్రమే అమ్ముడు అవుతున్నాయంటూ వైఎస్ జగన్ తన ట్విట్టర్ ఖాతాలో చెప్పడం పూర్తిగా సత్యదూరమని పేర్కొంది.
అక్టోబర్‌లో ఈ సీజన్ ప్రారంభం కాగానే టన్ను రూ.12 వేల నుంచి రూ.14 వేల వరకూ అమ్ముడు పోయిందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. నవంబరు మొదటి వారంలో ఏ గ్రేడు అరటి పండ్లు రూ.7 వేలు, బీ గ్రేడ్ రూ.4 వేలు, సీ గ్రేడ్ రూ.3వేలకు అమ్ముడు పోయాయని చెప్పింది. రెండో వారంలో అవే ధరలు నిలకడగా కొనసాగాయని పేర్కొంది. మూడో వారంలో ఏ గ్రేడు రూ.8 వేలు, బీ గ్రేడు రూ.4 వేలు, సీ గ్రేడు రూ.3 వేలకు అమ్ముడు పోయాయని తెలిపింది. నాలుగో వారంలో ఏ గ్రేడు రూ.8 వేల నుంచి రూ.10 వేలకు పెరిగిందని.. బీ గ్రేడు రూ.6 వేల నుంచి రూ 8 వేలకు, సీ గ్రేడు రూ. 4 వేల నుంచి రూ.6 వేల వరకు అమ్ముడు పోయాయని వివరించింది.
అనంతపూర్, సత్యసాయి జిల్లా, కడప, నంద్యాల జిల్లాల్లో 34,000 హెక్టార్లలో అరటి పంట వేయగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అత్యధిక వర్షాలు కురియడంతో చాలా వరకు అరటి పంట దెబ్బతిన్నదని తెలిపింది. అయితే పంటల పరిస్థితిని ముందుగానే అంచనా వేసినందున ట్రేడర్లు, ఎగుమతిదారులతో అరటి పంట పండే అన్ని జిల్లాలలో జిల్లా కలెక్టర్లు సమావేశాలు ఏర్పాటు చేసి తగిన ఆదేశాలు ఇచ్చారని పేర్కొంది. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ మార్కెట్ లో కూడా ఇలాంటి సమావేశాలే ఏర్పాటు చేశారని చెప్పింది. హర్యానాలోని శీతల గిడ్డంగుల వారితో కూడా మాట్లాడారని తెలిపింది. ఫలితంగా ఉత్తర భారత దేశంలోని కొనుగోలు దారులు ఆంధ్రప్రదేశ్ లో పండిన అరటి కొనుగోలు ప్రారంభించారని తెలిపింది.
కడప, అనంతపూర్ జిల్లాల నుంచి 700 మెట్రిక్ టన్నుల అరటిని ఉత్తర భారత దేశంలోకి పంపి అక్కడ అమ్మడం జరిగిందని పేర్కొంది. గత వారం రోజులుగా మెట్రిక్ టన్నుకు రూ 2 వేల నుంచి రూ.4 వేలు పెరిగిందని తెలిపింది. అరటి రైతులకు రవాణా రాయితీ ఇవ్వాల్సిందిగా భారతీయ రైల్వే ను కోరామని.. డిసెంబర్ 2వ వారం నుంచి అరటి ధర మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. వాస్తవాలు ఇలా ఉండగా రైతులలో నిరాశ నింపే విధంగా ప్రకటనలు చేయడం సబబు కాదని హితవు పలికింది. రైతు సోదరులు కూడా వాస్తవాలు గ్రహించి ఇలాంటి ప్రచారాలకు ప్రభావితులు కారాదని కోరింది..