Srisailam | శ్రీశైలం : ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈ నెల 24, 25 తేదీల్లో శ్రీశైలంలో పర్యటించనున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని, భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలను దర్శించుకోనున్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో నంద్యాల కలెక్టర్ జీ రాజకుమారి ఏర్పాట్లను పరిశీలించి.. పక్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సున్నిపెంటలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ను జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్‌తో పాటు సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం కోసం గవర్నర్ శ్రీశైలం దేవస్థానానికి వస్తున్నారని.. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. హెలిప్యాడ్ మైదానం చుట్టూ బారి కేడ్లు ఏర్పాటు చేయాలని, వాటర్ చల్లించాలని ఆర్అండ్బీ, అగ్నిమాపకశాఖ అధికారులను ఆదేశించారు.
కాన్వాయ్‌లో కండిషన్ ఉన్న వాహనాలను ఏర్పాటు చేయాలని జిల్లా రవాణా అధికారులను ఆదేశించారు. భ్రమరాంబ అతిథిగృహంలో ప్రోటోకాల్ ప్రకారం.. గవర్నర్‌కు వసతి, అల్పాహారం, తేనీరు, భోజనం తదితర ఏర్పాట్లను చేయాలని దేవస్థానం ఈవోకు సూచించారు. కాన్వాయ్ వెంట దేవస్థాన పరిధిలో అగ్నిమాపక వాహనాలు, సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. హెలిప్యాడ్ సమీపంలో మెడికల్ క్యాంప్, అంబులెన్స్, కార్డియాలజిస్ట్‌తో పాటు నైపుణ్యం ఉన్న డాక్టర్లను అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్యాధికారి, డీసీహెచ్ఎస్, నంద్యాల సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ని కలెక్టర్ ఆదేశించారు. గవర్నర్ పర్యటించే ప్రాంతాల్లో పారిశుధ్య పనులు ముమ్మరంగా చేపట్టాలని డీపీవోకు సూచించారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. దేవస్థానంలో సంప్రదాయం మేరకు గవర్నర్‌కు స్వామి అమ్మవార్ల దర్శనాలను కల్పించాలని, ఈ మేరకు ఏర్పాటు చేయాలని దేవస్థానం అధికారులకు సూచించారు.