అమరావతి : ఏపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్వాతంత్య్ర (Independence) , గణతంత్ర (Republic Days) దినోత్సవాల నిర్వహణకు భారీగా నిధులు(Funds) పెంచింది. గ్రామ పంచాయతీలు, మేజర్ గ్రామ పంచాయతీలకు ప్రస్తుతం కేటాయిస్తున్న నిధులను వందశాతం పెంచింది. ఇటీవల ఏపీ పంచాయతీ, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) ను కలిసిన సర్పంచులు నిధుల పెంపు విషయం చర్చించారు.
ఈ సందర్భంగా వచ్చే పంద్రాగస్టు, రిపబ్లిక్ డే నాడు మైనర్ పంచాయతీలకు వంద నుంచి రూ. 10 వేలకు, మేజర్ గ్రామ పంచాయతీలకు రూ. 250 నుంచి రూ. 25, 000 పెంచుతున్నట్లు మంత్రి పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఈ నిధులతో పాఠశాలల్లో డిబేట్,క్విజ్, వ్యాసరచన పోటీలు, విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వాలని సూచించారు.
పంద్రాగస్టున స్కూళ్లల్లో స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించాలని , రక్షణరంగంలో పనిచేసినవారిని, పారిశుధ్య కార్మికులను సత్కరించాలని కోరారు. స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు స్వీట్లు, చాక్లెట్లు ఇవ్వాలని కోరారు.