AP News | ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి కూటమి ప్రభుత్వం షాకిచ్చింది. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి ఆనుకుని ఉన్న చిక్కవడియార్ చెరువును ఆక్రమించారంటూ కేతిరెడ్డి తమ్ముడి భార్య గాలి వసుమతికి నోటీసులిచ్చింది. ఏడు రోజుల్లోగా కబ్జా చేసిన స్థలాలను ఖాళీ చేయకపోతే అందులో ఉన్న నిర్మాణాలు, చెట్లు, పంటలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఆ నోటీసుల్లో నీటిపారుదల శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ధర్మవరం రెవెన్యూ గ్రామ పరిదిలోని 904, 905, 908, 909 సర్వే నంబర్లలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తమ్ముడు (వెంకటకృష్ణారెడ్డి) భార్య వసుమతి పేరుతో రైతుల నుంచి 25 ఎకరాలు కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో ఉంది. అయితే వీటికి ఆనుకుని 908, 909, 910, 616-1 సర్వే నంబర్లలో ఉన్న చెరువు స్థలం 20 ఎకరాల వరకు ఆక్రమించి కలిపేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 45 ఎకరాల్లో పలు రకాల పండ్ల తోటలు సాగుచేశారు. ఇందులోనే లగ్జరీ ఫామ్‌హౌజ్, రేసింగ్ ట్రాక్ నిర్మించారు. దీంతో 20 ఎకరాల చెరువు భూమిని కబ్జా చేశారనే ఆరోపణలపై వసుమతికి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 5వ తేదీన నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వ భూమిని ఆక్రమించారంటూ కేతిరెడ్డి ప్రధాన అనుచరుడు జె.సూర్యనారాయణకు ధర్మవరం తహశీల్దార్ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ భూములు, చెరువు కలిపి మొత్తం 30 ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులు తెలిపారు.
2023 ఏప్రిల్‌లో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర సందర్భంగా ధర్మవరం చెరువు కబ్జాపై ఆయన ఆరోపణలు చేశారు. వాటిని నిరూపించుకోవాలంటూ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి సవాలు విసిరారు. ఆ మరుసటి రోజే చెరువు కబ్జాకు సంబంధించిన ఆధారాలను నారా లోకేశ్ విడుదల చేశారు. అధికారంలోకి రాగానే కేతిరెడ్డి కబ్జాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందులో భాగంగానే చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం.
Kethireddy Venkatramireddy1
Kethireddy Venkatramireddy2