AP News | ఏపీలోని ప్రధాన ఆలయాల్లో భక్తులకు దర్శనం సులువుగా అయ్యేందుకు కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దర్శనం టికెట్లను సులువుగా జారీ చేసేందుకు ముఖ్య ఆలయాల్లో కియోస్క్ మెషిన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రధాన ఆలయాల్లో టచ్ స్క్రీన్‌తో ఉన్న కియోస్క్‌లను ఏర్పాటు చేయబోతున్నారు.
ఆలయాల్లో ఏర్పాటు చేసే ఈ కియోస్క్ మెషిన్ల ద్వారా భక్తులు నేరుగా దర్శనం, వివిధ సేవల టికెట్లను నేరుగా బుక్ చేసుకోవచ్చు. ఉద్యోగుల అవసరం లేకుండానే నేరుగా ఎన్ని టికెట్లు కావాలో ఎంటర్ చేసి, డిజిటల్ పేమెంట్ చేస్తే వెంటనే టికెట్లను జారీ చేస్తుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. కాగా, ఈ 100 కియోస్క్‌లను అందించేందుకు కరూర్ వైశ్య బ్యాంకు ముందుకొచ్చింది. ఈ మెషిన్ల ఇన్స్టాలేషన్, నిర్వహణ కూడా ఆ బ్యాంకే చూసుకుంటుందని స్పష్టం చేసింది.
ఏపీలోని ప్రధాన ఆలయాలైన సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి దేవాలయాల్లో 8 చొప్పున కియోస్క్‌లను ఏర్పాటు చేస్తారు. అరసవిల్లి, విశాఖ కనకమహాలక్ష్మీ, తలుపులమ్మ, వాడపల్లి పెనుగంచిప్రోలు, మోపిదేవి, పెదకాకాని, కసాపురం ఆంజనేయ స్వామి, కదిరి లక్ష్మీనరసింహస్వామి, బోయకొండ గంగమ్మ ఆలయాల్లో మూడేసి కియోస్క్‌లు ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా భక్తులు చేసిన డిజిటల్ పేమెంట్స్ జమ అయ్యేందుకు ఆయా ఆలయాల ఈవోల పేరిట కరూర్ వైశ్య బ్యాంకులో అకౌంట్లు ఇవ్వనున్నారు.