ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖలో శారదా పీఠానికి గత వైసీపీ ప్రభుత్వం కేటాయించిన భూమిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
వైసీపీ హయాంలో స్వరూపానందేంద్ర స్వామి విజ్ఞప్తి మేరకు 2021లో జగన్ ప్రభుత్వం 15 ఎకరాల భూమిని కేటాయించింది. భీమిలిని ఆనుకుని ఉన్న కొండపై 102/2 సర్వే నంబర్లోని 7.70 ఎకరాలు, 103 సర్వే నంబర్లోని 7.30 ఎకరాల్ని జగన్ ప్రభుత్వం స్వరూపానందేంద్ర స్వామికి చెందిన శారదా పీఠానికి కేటాయించింది. రూ.220 కోట్లు విలువ చేసే 15 ఎకరాల స్థలాన్ని కేవలం రూ.15 లక్షలకే ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు 2021 నవంబర్లో ఓ జీవో ఇచ్చింది.
కాగా, 2021లో ఇచ్చిన ఆ జీవోను సవరించాలని శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర 2023 నవంబర్ 20న ఏపీ సీఎంవోకి లేఖ రాశారు. శారదా పీఠానికి ఆదాయం సమకూర్చుకోవడానికి ఆ భూముల్ని వాడుకోవాలన్నది తమ ఉద్దేశమని.. కానీ జీవోలో మాత్రం వేద వ్యాప్తికి, పీఠం కార్యకలాపాల విస్తరణకు వినియోగించాలని ఉందని లేఖలో పేర్కొన్నారు. జీవోను సవరించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన సీఎంవో.. వెసులుబాటు కల్పిస్తూ 2024 ఫిబ్రవరిలో జగన్ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.