Sand Policy | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పాత ఇసుక విధానాన్ని ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019, 2021లో ఇచ్చిన ఇసుక విధానాలను రద్దు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉచిత ఇసుక విధానానికి సంబంధించి కలెక్టర్లకు అంతర్గత మార్గదర్శకాలు జారీ చేసింది. 2024 ఇసుక విధానం రూపకల్పన చేసేంతవరకు కూడా ఇసుక సరఫరాకు ఇవే మార్గదర్శకాలు అందుబాటులో ఉండనున్నాయి.
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానాన్ని కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. సోమవారం కొన్ని జిల్లాల్లోని స్టాక్ పాయింట్ల వద్ద ఉచిత సరఫరాను మొదలుపెట్టారు. ఈ విధానం ద్వారా అర్హులైన వారందరికీ ఉచితంగా ఇసుకను అందజేయనున్నారు. అయితే ఇసుక తవ్వకాల కోసం సీనరేజ్, రవాణా ఖర్చులు వంటి నామమాత్ర రుసుములను వసూలు చేయనున్నారు. ఈ ఛార్జీలను కూడా డిజిటల్ విధానంలో స్వీకరించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఉచిత ఇసుక విధానంలో పారదర్శకతను పాటించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే రాష్ట్రంలోని ఇసుక నిల్వ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి? వాటిలో ఎంత ఇసుక అందుబాటులో ఉంది? తదితర వివరాలను కూడా ప్రజలు ఎప్పటికప్పుడు చెక్ చేసుకునేలా వెసులుబాటు కల్పించింది. గనుల శాఖ అధికారిక వెబ్సైట్లో ఇసుకకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు అందుబాటులో ఉంచనున్నారు. అమ్మకాలు మొదలైనప్పటి నుంచి ఏ రోజుకు ఆరోజు జరిగిన ఇసుక విక్రయాలు, నిల్వల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయనున్నారు.