ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు చెప్పేదానికి, చేసేదానికి పొంతన ఉండటం లేదని విమర్శించారు. చంద్రబాబు మాటలకు అర్థాలే వేరులే అని ఎద్దేవా చేశారు. ఇసుక, మద్యం జోలికి వెళ్లొద్దని చంద్రబాబు చెబుతారని.. కానీ టీడీపీ నేతలు మాత్రం వాటినే ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారని అన్నారు.
ఇసుక, మద్యం విషయంలో కూటమి ప్రభుత్వ పెద్దలు అవినీతికి పాల్పడ్డారని మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి విమర్శించారు. సూపర్ సిక్స్‌లో ఒక్క హామీ చేయలేక.. ఇప్పుడు ఇసుకపై కొత్త నాటకానికి తెరతీశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక, మద్యానికి సంబంధించి ఎన్నో దౌర్జన్యాలు జరిగాయని.. కానీ ఎవరి మీద చర్యలు తీసుకోలేదని తెలిపారు. లాటరీలో మద్యం షాపుల లైసెన్సులు పొందిన వారిని కిడ్నాప్ చేశారని, ఇసుక టెండర్లు పొందిన వారిని మంత్రులు భయపెడుతున్నారని అన్నారు.
నెల్లూరు జిల్లాలో నాలుగు ఇసుక రీచ్‌ల కోసం టెండర్లు పిలిచారని.. లాటరీ ద్వారా ఎంపిక చేయాలని మంత్రి నారాయణ ఆదేశాలు ఇచ్చారని కాకాణి అన్నారు. మా రీచ్‌లో తెలియకుండా టెండర్లు ఎలా వేశారంటూ ఒక మంత్రి, ఎమ్మెల్యే లాటరీల్లో పొందిన వారిని భయపెడుతున్నారని విమర్శించారు. ఒక మంత్రి తీసుకున్న నిర్ణయాన్ని పట్టించుకోకుండా కలెక్టర్ టెండర్లు రద్దు చేశారని చెప్పారు. మంత్రి అంటే ఒక లెక్క లేకుండా చేశారని అన్నారు. దీనిపై కలెక్టర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 25న కలెక్టర్ వద్ద ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.