Kiran Kumar Reddy | కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత నల్లారి కిరన్ కుమార్ రెడ్డి సెటైర్లు వేశారు. రోజురోజుకీ రాహుల్ గాంధీ తెలివి ఏమవుతుందో అర్థం కావడం లేదని విమర్శించారు. ఆటంబాంబు పేలుస్తామని రాహుల్ అన్నారని.. కానీ అది తుస్సుమనిపోయిందన్నారు.
రాయచోటిలో మీడియాతో కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రిగ్గింగ్ చేసి, ఎన్నికల కమిషన్‌తో ములాఖత్ అయ్యి కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిందని రాహుల్ గాంధీ అన్నారని గుర్తుచేశారు. మాట్లాడేముందు కొంచెమైనా తెలివి ఉపయోగించాలి కదా అని విమర్శించారు. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే బీజేపీకి దగ్గర దగ్గర 282 సీట్లు వచ్చాయని గుర్తుచేశారు. దాదాపు 35 సంవత్సరాల తర్వాత మొట్ట మొదటిసారిగా ఒక పార్టీకి అప్పుడే పూర్తి మెజార్టీ వచ్చిందని అన్నారు. ఇక 2019లో 303 సీట్లు గెలుచుకుందని తెలిపారు.
2024లో జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగితే 400 సీట్లు రావాలి కానీ 240 సీట్లు ఎలా వస్తాయని రాహుల్‌గాంధీని కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్‌తో కలిసి బీజేపీ రిగ్గింగ్ చేస్తే 400 సీట్లు వచ్చేవి కానీ 240 సీట్లు ఎలా వస్తాయని నిలదీశారు. దీని గురించి బాగా ఆలోచించుకోవాలని సూచించారు. అన్ని సంవత్సరాలు పార్టీలో ఉన్న నాకే రాహుల్ గాంధీ మాటలు అర్థం కాలేదు.. ఇక ప్రజలకు ఎలా అర్థమవుతాయని ఎద్దేవా చేశారు.
పార్లమెంటు ఎన్నికల సమయంలో మహారాష్ట్రలో దాదాపు సగం ఎంపీ సీట్లు వచ్చాయని.. కానీ ఐదు నెలల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగితే పూర్తిగా డిపాజిట్లు ఎలా గల్లంతయ్యాయని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. కొంచెం తెలివిగా మాట్లాడాలని.. లేదంటే తెలివి ఉన్న వారిని పక్కన పెట్టుకోవాలని సూచించారు. 2019లో జరిగిన ఏపీ ఎన్నికల ఫలితాలను ఈ సందర్భంగా ఆయన ఉదాహరించారు. అప్పుడు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు కలిపి జరిగితే.. 156 అసెంబ్లీ స్థానాలు, 36 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించిందని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఒకేరోజు ఒకేసారి ఎన్నికలు జరిగితే పార్లమెంట్లో ఫుల్ మెజారిటీ వచ్చింది.. అసెంబ్లీలో తక్కువ మెజార్టీ వచ్చిందని గుర్తుచేశారు. దీన్ని రిగ్గింగ్ అంటారా అని ప్రశ్నించారు.