Srisailam | శ్రీశైల దేవస్థానం పరిధిలోని ప్రాచీన కట్టడాల స్థితిగతులను గురువారం దేవాదాయశాఖ శిల్పి విభాగం, ఇంజినీరింగ్ అధికారులు పరిశీలించారు. దేవస్థాన క్షేత్ర పరిధిలోని ప్రాచీన కట్టడాలను పరిరక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని దేవస్థాన అధికారులకు ఏపీ దేవదాయశాఖ స్థపతి పీ పరమేశప్ప చెప్పారు.
శ్రీ స్వామి అమ్మవార్ల పాకశాలలకు సాలాహారాలు నిర్మించి సంప్రదాయంగా అలంకరణ పూర్తి చేయాలని పీ పరమేశప్ప సూచించారు. ప్రధాన ఆలయ ప్రాంగణంలోని బండ పరుపు హెచ్చు తగ్గుల్లేకుండా సమతలంగా ఉండేలా తగిన మరమ్మతు పనులు చేయాలని హితవు చెప్పారు. అమ్మవారి ఆలయంలోని ఉత్తర భాగంలో నిర్మాణంలో ఉన్న సాలు మండప నిర్మాణాన్ని వేగవంతం చేసి పనులు పూర్తి చేయాలని చెప్పారు.
శ్రీశైల మహా క్షేత్ర ప్రాచీన వైభవాన్ని కాపాడుకుంటూ ఆధ్యాత్మిక శోభను బలోపేతం చేసేలా తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో లవన్న ప్రకటించారు. ప్రధానంగా బండపరుపు హెచ్చుతగ్గులు లేకుండా ఉండాలని అన్నారు. వేల సంవత్సరాల చరిత్రగల శ్రీశైల క్షేత్ర ప్రాచీన కట్టడాలను కాపాడుకుని భావి తరాలకు ప్రాచీన శిల్పకళా వైభవాన్ని చూపించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
అంతకుముందు ఆలయ పశ్చిమ ప్రాకార కుఢ్యం, ఆలయ ప్రాంగణంలోని బండపరుపు, వీర శిరోమండపం, నంది మండపం, అమ్మవారి ఆలయ ద్వార గోపురం తదితర కట్టడాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం ఈఓ ఎస్ లవన్న, ఏపీ దేవదాయశాఖ స్థపతి పీ పరమేశప్ప, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు వీ రామక్రుష్ణ, మురళీధర్ రెడ్డి, కర్నూల్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీనివాస ప్రసాద్, దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఐ/సీ) పీ చంద్రశేఖర శాస్త్రి, సహాయ స్థపతి అయిలూరి ఉమా వెంకట జవహర్ లాల్, ఏఈలు భవన్ కుమార్, రాజారావు, స్ట్రక్చరర్ ఇంజినీర్లు వేణుగోపాల్ రెడ్డి, రమేశ్, నగేశ్ తదితరులు ఉన్నారు.