విజయవాడ: తాము అనుకున్నట్లుగా ప్రభుత్వ ఉద్యోగులు ‘ఛలో విజయవాడ’ చేసి చూపారు. ప్రభుత్వ ఆంక్షలు, పోలీసుల నిర్భందం నడుమ వేలాది మంది విజయవాడకు ప్రభంజనంలా తరలివచ్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు తరలిరావడంతో విజయవాడ.. ఉద్యోగ సంద్రంగా మారిపోయింది. ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. సాధారణ ప్రజల జనజీవనం స్తంభించిపోయింది. ఉదయం నుంచి ఉద్యోగులు తరలివస్తుండటంతో విజయవాడలో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన పీఆర్సీ జీఓలను రద్దు చేయాలంటూ పీఆర్సీ సాధన సమితి కమిటీ పిలుపు మేరకు ‘చలో విజయవాడ’ నిరసన కార్యక్రమంలో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వీరిని అడ్డుకునేందుకు అన్ని జిల్లాల్లో పోలీసులు ఎంత ప్రయత్నించినా ఉద్యోగులు విజయవాడకు చేరుకోగలిగారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించి ఎన్జీవో భవన్ నుంచి అలంకార్ థియేటర్ సెంటర్ మీదుగా బీఆర్టీఎస్ రోడ్డుకు చేరుకున్నారు. బుధవారం రాత్రి నుంచి విజయవాడ నగరంలోకి ఉద్యోగులను రానీయకుండా పోలీసులు అడ్డుకోవడంతో పాటు ఉద్యోగ సంఘాల నేతలకు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు విజయవాడ నగరానికి చేరుకుని తమ నిరసన తెలిపారు.
తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగులు రోడ్డెక్కారు. ర్యాలీ చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనప్పటికీ బీఆర్టీఎస్ రోడ్డులో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి తమ సత్తా ఏంటో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ప్రభుత్వం పీఆర్సీ ఫిక్సేషన్ చేస్తూ జారీ చేసిన జీవోలను వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం కొనసాగుతుందని వెల్లడించారు. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకొచ్చేందుకు తొలుత ఈ నెల 5 నుంచి సహాయ నిరాకరణ చేపట్టాలని, ఈ నెల 7 వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనకు మద్దతుగా విద్యుత్, ఆర్టీసీ ఉద్యోగులు కూడా సమ్మెలోకి వస్తున్నట్లు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.