AP Voters List | ఏపీలో సవరించిన తుది ఓటర్ల జాబితాను ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. ఆ జాబితా ప్రకారం 2025 జనవరి 1వ తేదీ నాటికి ఏపీలో మొత్తం 4,14,40,447 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 2,10,81,814 మంది పురుష ఓటర్లు, 2,02,88,549 మంది మహిళా ఓటర్లు ఉన్నారని ఎన్నికల సంఘం వెల్లడించింది.
అలాగే 66,690 మంది సర్వీస్ ఓటర్లు, 3400 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారని ఏపీ ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మొత్తం ఓటర్లలో 18 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ఓటర్లు 5,14,646 మంది ఉన్నారు. ఇక రాష్ట్రంలో 46,397 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని ఎన్నికల సంఘం తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే 232 పోలింగ్ కేంద్రాలు పెరిగాయని పేర్కొంది.
ముసాయిదా ఓటర్ల జాబితాను గత ఏడాది అక్టోబర్ 29వ తేదీన ఏపీ ఎన్నికల సంఘం ప్రకటించింది. ముసాయిదా జాబితాపై అదే ఏడాది నవంబర్ 28 వరకు అభ్యంతరాలను స్వీకరించింది. వచ్చిన అభ్యంతరాలకు పరిష్కారం చూపి సవరించిన తుది ఓటర్ల జాబితాను ఇవాళ ప్రకటించింది.