AP Dy CM Pawan Kalyan | సినిమా టికెట్ల ధరలు పెంచడం వల్ల ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో ఆదాయం వస్తుందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘గేమ్ ఛేంజర్ (Game Changer)’ సినిమా ఈ నెల పదో తేదీన విడుదల కానున్నది. ఈ నేపథ్యంలో శనివారం రాజమహేంద్రవరంలో జరిగిన మెగా పవర్ ఈవెంట్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ టికెట్ల ధరల పెంపు విషయంలో నెగెటివ్ ప్రచారం జరుగుతుందన్నారు. టికెట్ల ధర పెంపు డిమాండ్ అండ్ సప్లయ్ ఆధారంగా ఉంటుందని పవన్ కల్యాణ్ చెప్పారు.
గతంలో దర్శకుడు శంకర్ తీసిన జెంటిల్మెన్ సినిమాను తాను బ్లాక్లో టికెట్ కొని చూశానని, అలా టికెట్ కొనడం వల్ల ఆ డబ్బు వేరే వాళ్లకు వెళుతుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కానీ, ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచడం వల్ల జీఎస్టీ రూపంలో ఆదాయం వస్తుందన్నారు. గతంలో తన సినిమాకు టికెట్ ధరలు పెంచలేదని గుర్తు చేశారు. గత ప్రభుత్వం ‘భీమ్లా నాయక్’ సినిమాకు టికెట్ల ధరలు పెంచక పోగా తగ్గించిందని చెప్పారు. తమ కూటమి ప్రభుత్వానికి సినీ నటులంతా మద్దతు తెలుపలేదని, అయినా తాము ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. సినీ పరిశ్రమకు రాజకీయ రంగు పులమడం కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదన్నారు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడాలంటే సినిమాలు తీసే వారే మాట్లాడాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. చిత్ర పరిశ్రమలో క్రమశిక్షణ రావాలని అన్నారు. ‘సినిమాలు తీసే వాళ్లతోనే మేం మాట్లాడతాం. సినిమా టికెట్ ధరల విషయంలో హీరోలతో పనేమిటి.. నిర్మాతలు గానీ, ట్రేడ్ యూనియన్ సంఘాలు కానీ రావాలి. హీరోలు వచ్చి నమస్కారాలు పెట్టాలనేంత కింది స్థాయి వ్యక్తులం కాదు. ఎన్టీఆర్ పాటించిన ఔన్నత్యాన్ని మేం కొనసాగిస్తున్నాం. రాజకీయాలకీతంగా ఆయన తోటి నటులను గౌరవించే వారు. సినీ పరిశ్రమపై మా కూటమి ప్రభుత్వానికి గౌరవం ఉంది. తెలుగు సినిమా పరిశ్రమను సీఎం చంద్రబాబు ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉన్నారు. సినిమా మంచీ చెడూ రెంటిని చూపుతుంది. సమాజాన్ని ఆలోచింపజేసే బాధ్యతతో తెలుగు చలన చిత్ర పరిశ్రమ సినిమాలు తీయాలి’ అని పవన్ కల్యాణ్ అన్నారు.