అమరావతి: పార్టీలోని ఓ నేత తనపై చేసిన ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తీవ్రస్థాయిలో స్పందించారు. పార్టీలో తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతున్నదని మీడియా సమావేశంలో వ్యాఖ్యానించి కలకలం రేపారు. నన్ను అవమానిస్తున్న విషయం సీఎం జగన్కు చెప్తే ఆ మహానుభావుడి పరిస్థితి ఏమవుతుందో అర్ధం చేసుకోవాలని సూచించారు. తన బాగు కోసం కార్యకర్తలను మోసం చేసే వారు పార్టీని వీడి వెళ్లిపోవడం మంచిదని హితవు పలికారు.
పార్టీలో తనపై కుట్ర జరుగుతున్న మాట వాస్తవమే అని, కుట్రంతా గంగాధర నెల్లూరు మండలంలోనే జరుగుతున్నదని నారాయణ స్వామి ఆరపించారు. తాను అవినీతికి పాల్పడినట్లు ఒకవేళ ఆరోపణలు చేసిన నేత నిరూపిస్తే.. వాళ్ల కాళ్లు పట్టుకునేందుకు కూడా సిద్ధమేనన్నారు. ఇలాంటి చవకబారు వ్యక్తుల ఆరోపణల వల్ల భవిష్యత్లో సీఎం జగన్కు తనపై నిజంగానే కోపం వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని నారాయణ స్వామి ఆందోళన వ్యక్తం చేశారు.
తనపై ఆరోపణలు చేసిన మహానుభావుడు ఎవరో మీకు తెలిసే ఉంటుందన్న నారాయణస్వామి.. తనను అవమానించిన విషయం చెప్తే ఏమవుతుందన్నది ఆయనకు అర్థం కావడం లేదన్నారు. ఆయనకు తానేదో అన్యాయం చేసినట్లు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఎవరి వద్దైనా ఒక్క రూపాయి లంచం తీసుకున్నట్టు గానీ.. అన్యాయం చేసినట్టు గానీ.. ఆయన లేదా అతడి అనుచరులు ఎవరైనా నిరూపిస్తే వాళ్ల కాళ్లకు దండం పెట్టేందుకు సిద్ధమని చెప్పారు. ఆ మహానుభావుడే గతంలో నేను ఎస్సీగా పుట్టి ఉంటే బాగుండేదని, తనకూ ఓ పదవి దక్కేదంటూ వ్యాఖ్యలు చేసి చులకన అయ్యారని తెలిపారు. అలాంటి వ్యక్తిని నమ్ముకుని కార్యకర్తలు మోసపోకుండా చూసుకోవాలని ఆయన సూచించారు.