AP News | విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడు శరత్‌తో పాటు ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు (జీవీ) కిడ్నాప్ గురువారం కలకలం రేపింది. ఎంపీ కుటుంబాన్ని బంధించిన కిడ్నాపర్లు వాళ్ల నుంచి విలువైన వస్తువులతో పాటు రూ.1.75 కోట్లను తీసుకున్నారు. మూడు రోజుల పాటు వాళ్లను బంధించిన కిడ్నాపర్లు.. చివరకు పోలీసులు రావడం చూసి భయపడి పారిపోయే క్రమంలో దొరికిపోయారు. వైజాగ్‌లో సంచలనం రేపిన ఈ కేసుకు సంబంధించిన వివరాలను తాజాగా ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాకు వివరించారు.
‘ రుషికొండలోని ఇంట్లో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుమారుడు శరత్ ఒక్కడే ఉంటున్నాడు. ఇది గమనించిన హేమంత్, వలపుల రాజేశ్, సాయి అనే ముగ్గురు నిందితులు ఇంట్లోకి ప్రవేశించారు. శరత్‌ను కత్తితో బెదిరించి అదే ఇంట్లో ఒక మూలన కట్టేశారు. మరుసటి రోజు ఉదయం ఎంపీ భార్య జ్యోతికి కాల్ చేసి రప్పించుకున్నారు. కత్తితో బెదిరించి ఆమెను కూడా కట్టేశారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఆడిటర్ జీవీని కూడా రప్పించారు. డబ్బుల కోసమే వారిని బంధించిన నిందితులు.. ఎంపీ కుమారుడి ఇంట్లో ఉన్న రూ.15 లక్షలు తీసుకున్నారు. అలాగే వారి అకౌంట్ల నుంచి రూ.60 లక్షల వరకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. జీవీని కొట్టి, బెదిరించి దాదాపు రూ.కోటి వరకు తెప్పించుకున్నారు. ఇలా మొత్తంగా రూ.1.75 కోట్లను వారి నుంచి నిందితులు తీసుకున్నారు. ‘ అని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కిడ్నాప్ జరిగిన తీరును మీడియాకు వివరించారు. సమాచారం అందుకున్న గంటల వ్యవధిలోనే ఘటనాస్థలికి చేరుకుని ముగ్గురు కిడ్నాపర్లు హేమంత్, బి.రాజేశ్, వలపుల రాజేశ్‌ను అరెస్టు చేశామని వెల్లడించారు. వారి నుంచి రూ.86.5 లక్షలు రికవరీ చేసినట్లు తెలిపారు.
అడ్వకేట్ బి.రాజేశ్ నుంచి రూ.21.5 లక్షలు, వలపుల రాజేశ్ తల్లి దగ్గర నుంచి రూ.25 లక్షలు, ప్రధాన నిందితుడైన హేమంత్ స్నేహితురాలు నవ్య నుంచి రూ.40 లక్షలు రికవరీ చేసినట్లు వివరించారు. ముగ్గురు కిడ్నాపర్లకు సహకరించిన వారిలో 17ఏళ్ల గోవర్దన్ అనే కుర్రాడిని కూడా అరెస్టు చేస్తామని తెలిపారు. కిడ్నాపర్లను కోర్టులో ప్రవేశపెడతామని చెప్పారు. ముగ్గురు కిడ్నాపర్లకు సహకరించిన బాలాజీ, ఎర్రోళ్ల సాయి, చందోలు సాయి అనే ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నారని తెలిపారు. వారిని కూడా తొందరలోనే అరెస్టు చేసి మిగతా డబ్బులు రికవరీ చేస్తామని పేర్కొన్నారు. ఘటన గురించి సమాచారం అందిన గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నామని ఏపీ డీజీపీ పునరుద్ఘాటించారు. కానీ ఈ కేసు విషయంలో లేని పోనివి రాస్తున్నారని.. ఈ ఘటన ఆధారంగా రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగిందనడం సరికాదన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నిర్వీర్యం కాలేదని స్పష్టం చేశారు. పోలీసులు అప్రమత్తంగా ఉండటం వల్లే ప్రమాదం తప్పిందన్నారు.