Pawan Kalyan | పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య తీరుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరం పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోయాయని, సివిల్ వివాదాల్లో డీఎస్పీ తరచూ జోక్యం చేసుకుంటున్నారని.. కొందరి పక్షం వహిస్తూ కూటమి నేతల పేరు వాడుతున్నట్లుగా పవన్ కల్యాణ్‌కు ఇటీవల ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో డీఎస్పీపై చర్యలకు పవన్ కల్యాణ్ దిగారు. డీఎస్పీ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తాను కోరారు.
ఆంధ్రప్రదేశ్‌లో జూదం ఆడటం, జూద కేంద్రాలు నిర్వహించడం, ప్రోత్సహించడం నేరమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ లో వీటిని నిర్వహించినా, ఆడినా ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ – 1974 ప్రకారం శిక్షార్హులు అవుతారు అని చట్టం చెబుతోందని తెలిపారు. రాష్ట్రంలో చట్ట విరుద్ధంగా జూద కేంద్రాలు సాగుతున్నాయని ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు. పేకాట క్లబ్బుల నిర్వహణపై ఆ ఫిర్యాదుల్లో తెలిపారన్నారు. కొందరు పెద్దలు పేకాట కేంద్రాలను నిర్వహిస్తూ, నెలవారి మామూళ్లను అధికారులకు అందజేస్తున్నారనే ఆరోపణలు అధికంగా ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో దీనిపై నిజానిజాలు తెలుసుకోవాలని, పోలీసు అధికారులకు దీనిపై ఉన్న సమాచారం తెలుసుకునేందుకు ఆరా తీశానని తెలిపారు. ఒకవేళ పోలీసు అధికారుల దృష్టికి వచ్చిన వివరాలు, దానిపై తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో తెలియజేయాలని రాష్ట్ర డీజీపీని కోరారు.
అంతకుముందు పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి డీఎస్పీ వ్యవహారంపై పవన్ కల్యాణ్ మాట్లాడారు. డీఎస్పీ జయసూర్యపై వచ్చిన ఫిర్యాదుల విషయాన్ని ఎస్పీతో పవన్ కల్యాణ్ ప్రస్తావించి, అతని వ్యవహారశైలిపై పూర్తి నివేదిక పంపించాలని ఆదేశించారు. అసాంఘిక వ్యవహారాలకు డీఎస్పీ స్థాయి అధికారి అండగా ఉండటాన్ని తీవ్రంగా పరిగణించాలని సూచించారు. పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చకుండా చూసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి వ్యవహారాలను కూటమి ప్రభుత్వం ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అలాగే డీఎస్పీపై వచ్చిన ఆరోపణలను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తాకు తెలియజేయాలని అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు.