Janasena | పార్టీ కోసం నిస్వార్ధంగా కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు.. భవిష్యత్తు తరాలకు బలమైన నాయకత్వం అందించే వ్యూహం.. నిరంతరం పార్టీ కోసం పని చేసే వారికి భద్రత అనే మూడు అంశాల ప్రాతిపదికన ‘త్రిశూల వ్యూహం’ రూపొందిస్తున్నా మని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. దసరా నుంచి అమలు చేసేందుకు పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ త్రిశూల్ వ్యూహం ద్వారా జనసేన పార్టీ సరికొత్త అధ్యాయం మొదలు కాబోతుందని స్పష్టం చేశారు.
విశాఖపట్నం వేదికగా శనివారం సాయంత్రం జరిగిన వేదికగా “సేనతో సేనాని” జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పవన్ కల్యాణ్ పాల్గొని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. శక్తి, ధర్మం, రహస్యాలకు ప్రతీకగా నిలిచే పరమ శివుడి త్రిశూలం మాదిరిగా ప్రతి క్రియాశీలక సభ్యుడికీ జనసేన పార్టీ గుర్తింపు, నాయకత్వం, భద్రత కల్పిస్తుందని తెలిపారు. పార్టీలో సభ్యులుగా మొదలు పెట్టి, పార్టీ ప్రస్థానంలో నిబద్దత, నిజాయతీతో భాగస్వామ్యమయ్యే ప్రతి జనసైనికుడు, వీర మహిళ శక్తివంతమైన నాయకుడిగా ఎదిగే పరిణామ క్రమమే మన దిశ.. మన త్రిశూల్.. మన జనసేన.. అని చెప్పారు.
పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకునే కార్యకర్తలు కిందిస్థాయిలోనే ఉండిపోకూడదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. వారివారి సామర్థ్యాన్ని బట్టి గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదగాలన్నదే తన తదుపరి రోడ్ మ్యాప్ అని తెలిపారు. కింది స్ధాయి నుంచి నాయకులు రావాలని.. అందుకోసం ఒక ప్రణాళికాబద్ధమైన వ్యూహం తయారు చేశామని పేర్కొన్నారు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియలో భాగంగా ఈ వ్యూహం అమలవుతుందని చెప్పారు. త్రిశూల్ ప్రోగ్రాంలో భాగంగా పార్టీ కోసం పని చేయాలన్న ఆలోచన ఉన్న ప్రతి క్రియాశీలక సభ్యుడికీ ప్రత్యేక మెంబర్ షిప్ ఐడీ ఇస్తామని తెలిపారు. ప్రతి క్రియాశీలక సభ్యుడు/సభ్యురాలు కేంద్ర కార్యాలయానికి అనుసంధానంగా పని చేసే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామ, వార్డు, నియోజకవర్గ, పార్లమెంటు, జిల్లా, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు బలమైన నాయకులు కావాలనుకునే వారి కోసం నేను రోడ్ మ్యాప్ సిద్ధం చేశానని ప్రకటించారు
మెంబర్ షిప్ టూ లీడర్ షిప్ మార్గమే మన విధానం. నాయకత్వం పదవి కాదని పవన్ కల్యాణ్ తెలిపారు. సేవతో, పోరాటాలతో సంపాదించే గౌరవమని. అది బాధ్యతతో కూడుకున్నదని పేర్కొన్నారు. పదవుల కోసం కాకుండా ప్రజల పట్ల అంకితభావంతో ముందుకు వచ్చినవారే నాయకులు అవుతారని చెప్పారు. క్షేత్ర స్థాయి కార్యకర్తలను మెంబర్ షిప్ టూ లీడర్ షిప్ మార్గంలో తీర్చిదిద్దాలన్నారు. సామర్థ్యం ఉన్న కార్యకర్తలను గుర్తించాలన్నారు. కొత్తతరం నాయకులను తయారు చేయాలని అన్నారు. అందుకోసం ప్రతి కార్యకర్తని నిబద్ధత గల నాయకులుగా తీర్చిదిద్దే కచ్చితమైన వ్యవస్థని నిర్మించబోతున్నామని చెప్పారు. నాయకత్వ శిక్షణ కార్యక్రమాలు, సైద్ధాంతిక శిక్షణ శిబిరాల ద్వారా క్షేత్ర స్థాయిలో పని చేసే అందరినీ ప్రభావవంతమైన నాయకులుగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామన్నారు.
మారుమూల గ్రామాల్లో ఉన్న యువతను నాయకులుగా తీర్చిదిద్దే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు, సాధారణంగా చేసే సభ్యత్వ నమోదు ప్రక్రియను కూడా ఆపించేశానని పవన్ కల్యాణ్ తెలిపారు. ఇక మీదట పాలనాపరమైన బాధ్యతలు చూస్తూనే, ప్రతి రోజూ పార్టీ కోసం నాలుగు గంటలు కేటాయిస్తానని పేర్కొన్నారు. పాలనాపరమైన బాధ్యతలు విస్మరించకుండా ఆదివారం, సెలవు దినాలు వాడుకుంటూ 2029 నాటికి మీ నుంచి బలమైన నాయకులను తయారు చేస్తానని చెప్పారు. తెలంగాణ జనసేన శ్రేణులకు ఎంతో పోరాటశక్తి ఉందని.. జనసేన భావజాలంతో మీరంతా బలపడండని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఎలా నిలబడి బలపడ్డాడో చెబుతాను అదే మీరు పాటించండని సూచించారు. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా ఇలా ఏ రాష్ట్రంలో ఉన్నవారికైనా ఇదే వర్తిస్తుందని స్పష్టం చేశారు.