Peddireddy Ramachandra Reddy | మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల కబ్జా వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. భూ ఆక్రమణలపై విచారణకు ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు.
చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలోని 75 ఎకరాల అటవీ భూములను పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించిందని కొద్దిరోజులుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులతో పవన్ కల్యాణ్ బుధవారం నాడు సమావేశమయ్యారు. అటవీ భూముల ఆక్రమణలు, అడవుల ధ్వంసంపై విచారణకు పవన్ కల్యాణ్ ఆదేశించారు. దీనిపై విచారించి నివేదిక ఇవ్వాలని పీసీపీఎఫ్కు సూచించారు.
ఇదిలా ఉంటే.. పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై ఇప్పటికే రెవెన్యూ అధికారులు నివేదికలను సిద్దం చేశారు. 75 ఎకరాల అటవీ భూములను అక్రమంగా పెద్దిరెడ్డి కుటుంబం పరిధిలో చేర్చడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రాథమిక నివేదికను అందజేశారు. పుంగనూరు, తంబళ్లపల్లి, రేణిగుంట మండలాల్లో రికార్డులు తారుమారు చేసి బినామీ పేర్లతో వందల ఎకరాలను ఆక్రమించినట్లుగా ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటన్నింటిపై రెవెన్యూ శాఖ అధికారులతో కాసేపట్లో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పెద్దిరెడ్డి భూమాఫియాపై తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.