Pawan Kalyan | తనకు కేటాయించిన శాఖలు మనసుకు, జనసేన సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. శనివారం ఆయన ప్రెస్‌నోట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా డెప్యూటీ సీఎం పదవితో పాటు తనకు కేటాయించిన పలు శాఖలపై స్పందించారు. ఇటీవల ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. మంత్రివర్గంలో పవన్ కల్యాణ్‌కు డెప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖలను అప్పగించగా.. ఆయా శాఖలన్నీ ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడేవి, ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరకు చేర్చేవిగా తాను భావిస్తున్నానని జనసేనాని పేర్కొన్నారు. 2008 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నానని.. తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించానన్నారు.
2019 ఎన్నికలకు ముందు ప్రజా పోరాట యాత్రను ప్రజల సమస్యల అవగాహన, మౌలిక సదుపాయాల కల్పనపై అధ్యయనం కోసమే చేపట్టానన్నారు. చాలా లోతుగా ఆనాడు స్వయంగా పరిశీలన జరిపానని.. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతీ ప్రాంతంలో నెలకొన్న సమస్యలపై బలమైన అవగాహన ఏర్పడిందన్నారు. విశాఖ మనంలో పర్యటించిన సమయంలో ‘కురిడి’ అనే గిరిజన గ్రామానికి వెళ్లానని.. ఆ గ్రామ ఆడపడుచులు గుక్కెడు నీటి కోసం తాము పడుతున్న అవస్థలు చెబుతూ.. అక్కడి బావిలో కలుషితమైపోయిన నీటిని చూపించారన్నారు. ఆ ప్రాంతంలోనే తోటవలస గ్రామానికి వెళ్లిన సమయంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఆ ఊరి ప్రజలు వివరించారని గుర్తు చేసుకున్నారు. గోదావరి జిల్లాలకు వెళ్లినప్పుడు పలు మత్స్యకార గ్రామాల వాసులు తాగునీటికి పడుతున్న ప్రయాసలను వివరించారన్నారు.
గ్రామీణ అభివృద్ధి – దేశాభివృద్ధి అనే నినాదం నామమాత్రంగా మిగిలిపోవడాన్ని తాను గమనించానని.. గుక్కెడు మంచి నీరు కోసం మైళ్ల దూరం వెళ్లి ప్రయాసతో బిందెడు నీరు తెచ్చుకుంటున్న ఆడపడుచుల అవస్థలు చూశానని.. కాలుష్యమయమైన జల వనరులనే తాగునీరుగా తప్పని పరిస్థితులలో వాడుకుంటున్న పల్లెవాసులను గమనించానన్నారు. ఉపాధి హామీ నిధులను సద్వినియోగం చేసుకోవడం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా పల్లెలకు రక్షిత తాగునీరు అందించి ప్రజల దాహార్తి తీర్చేందుకు కృషి చేస్తానన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనేది జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటని.. ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసునన్నారు.
ఓ వైపు పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరగాలని.. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా అందాలని తాను గట్టిగా కోరుకుంటున్నానన్నారు. అయితే ఆ అభివృద్ధి పర్యావరణానికి హితంగా జరగాలని.. ఆధునిక సాంకేతికత మేళవించిన సురక్షితమైన పారిశ్రామిక అభివృద్ధి ఈ సమాజానికి అవసరమన్నారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదాన్ని మనం ఏనాడూ మరచిపోలేమని.. ప్రజల ఆరోగ్యాలను హరించి వేయకుండా పరిశ్రమలు ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకునేలా పరిశ్రమలు ముందుకు వెళ్లేందుకు చేయూతనిస్తామన్నారు. భూ తాపాన్ని తగ్గించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న ప్రయత్నాలకు బాసటగా నిలుస్తామన్నారు. గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకునేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తామన్నారు.
వృక్షో రక్షతి రక్షితః అనే సూక్తి తన మదిలో ఎప్పుడూ మారుమోగుతుంటుందని.. ఒక్క వృక్షాన్ని రక్షించుకుంటేనే మానవ కోటికి ఎంతో మేలు కలుగుతున్నప్పుడు.. మరి లక్షలాది వృక్షాలను తన గర్భాన నిలుపుకున్న అడవి తల్లిని కంటికి రెప్పలా కాపాడుకుంటే ఎంతో మేలు కలుగుతుందన్నారు. అడవుల విధ్వంసమే కరవు కాటకాలకు హేతువని.. అలాంటి అడవులను కంటికి రెప్పలా కాపాడుతామన్నారు. ఎర్రచందనం, అటవీ సంపద అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపుతామని హెచ్చరించారు. అడవుల వినాశనానికి పాల్పడినా, ప్రయత్నించినా ఎంతటి వారైనా సరే కటకటాల వెనక్కు వెళ్లాల్సిందేనన్నారు.