Janasena | జనసేన బలోపేతంపై ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టిసారించారు. ఈ క్రమంలోనే పార్టీ కమిటీల్లో పలు మార్పులు చేర్పుల ప్రక్రియపై ఫోకస్ చేశారు. ఈ మేరకు కమిటీల నిర్మాణం, వాటి కూర్పుపై పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యులకు శనివారం నాడు దిశానిర్దేశం చేశారు.
పార్టీ కార్యక్రమాల నిర్వహణ, కార్యకర్తల మనోభావాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని పార్టీ శ్రేణులతో పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. జిల్లాల్లో పార్టీ బలోపేతంపై చర్చించారు. ముఖ్యంగా ఉమ్మడి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో బలమైన శ్రేణులు ఉన్నాయని, అక్కడ నాయకత్వాన్ని మరింత పటిష్టం చేసి, పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయాలని నిర్ణయించారు.
పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఇచ్చిన ఆదేశాలను అనుసరించి పార్టీ కేంద్ర కార్యాలయ బృందం వివిధ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు, వీర మహిళలతో చర్చిస్తోంది. వారి మనోగతాన్ని, అందిస్తున్న సూచనలను నమోదు చేస్తున్నారు. రాజకీయ పరిస్థితులతోపాటు పాలనాపరమైన అంశాలపై క్షేత్ర స్థాయిలో ప్రజల్లో ఉన్న అభిప్రాయాలూ కూడా పార్టీ శ్రేణులు తెలియచేస్తున్నాయి. ఆ నివేదికలను పవన్ కళ్యాణ్ నిశితంగా పరిశీలన చేస్తున్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు, వీర మహిళలతో చర్చించి నివేదికలు ఇవ్వాలని కేంద్ర కార్యాలయ బృందానికి స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర కమిటీ నుంచి జిల్లా, మండల, గ్రామ స్థాయి కమిటీల వరకూ నిర్మాణ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలన్నారు.