Pawan Kalyan | జగన్ హయాంలో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో పడిన ఇబ్బందులను ఆటో డ్రైవర్లు తమ దృష్టికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. గ్రీన్ ట్యాక్స్ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారని చెప్పారు. అందుకే కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే గ్రీన్ ట్యాక్స్ సమస్యను పరిష్కరించామని వివరించారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఆటోడ్రైవర్ల సేవలో పథకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం స్త్రీ శక్తి పథకం అమలు సమయంలో ఆటో డ్రైవర్ల గురించి ఆలోచన చేశామని తెలిపారు. ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తే ఆటో డ్రైవర్ల ఉపాధికి ఇబ్బంది అవుతుందని చర్చించామని పేర్కొన్నారు. కేబినెట్ మీటింగ్‌లో ఆటో డ్రైవర్ల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని తెలిపారు. ఈ క్రమంలోనే ఆటోడ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. ఈ పథకం కింద ఒక్కో ఆటో డ్రైవర్‌కు ఏటా రూ.15వేలు ఇస్తున్నామని చెప్పారు. ఈ పథకం కోసం రూ.436 కోట్లు ఖర్చవుతుందని.. ప్రభుత్వానికి భారమే అయినప్పటికీ.. తమ ప్రభుత్వం ఆనందంగా మోస్తుందని తెలిపారు.