AP Dy CM Pawan Kalyan | రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధ్యతగా వ్యవహరించాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పోలీసులు బాధ్యతాయుతంగా పని చేయకుంటే వారు చేసే తప్పుల వల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. ఇటీవల కాకినాడ జిల్లా తుని సమీపాన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన ఘటన విషయంలో పోలీసులు అనుసరించిన తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితుల తల్లిదండ్రులతో పోలీసులు వ్యవహరించిన తీరు ఆ కుటుంబాలను తీవ్ర మనస్తాపానికి గురి చేసిందన్నారు.
తుని సమీపాన రోడ్డు ప్రమాదంలో మరణించిన భీమవరం ప్రాంత పొలిశెట్టి రేవంత్ శ్రీమురహరి, విజయవాడ వాసి నాదెండ్ల నిరంజన్ కుటుంబాల సభ్యులకు శనివారం మంగళగిరిలోని డిప్యూటీ సీఎం కార్యాలయంలో పవన్ కల్యాణ్ ధైర్యం చెప్పారు. మృతుల కుటుంబాలకు తన ట్రస్ట్ తరఫున రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. పోలీసుల తీరుపై బాధిత కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పారు. కనీసం జవాబు చెప్పకపోగా పోలీసులు మాట్లాడిన తీరు బాగా లేదని అన్నారు. ప్రమాద కారకుడైన డ్రైవర్ మీద ఎందుకు కేసులు నమోదు చేయలేదని పోలీసులను ఆయన నిలదీశారు.