Cyclone Alert | మొంథా తుపాన్ ముప్పు నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లాల కలెక్టర్లతో ఏపీ సీఎస్ విజయానంద్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్లు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
తుపాన్ ప్రభావం ఉండే అన్ని మండలాల్లోవెంటనే కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారు. గ్రామస్థాయిలోని సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. తాగునీరు, పాలు, కూరగాయలు, కొవ్వొత్తులు, ఇతరత్రా నిత్యవసర సరుకులు తగిన స్థాయిలో నిల్వ ఉంచాలన్నారు. పునరావాస కేంద్రాలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. మొబైల్ సిగ్నల్ అంతరాయం లేకుండా టెలికాం కంపెనీలతో సమన్వయం చేసుకోవాలని సీఎస్ సూచించారు. కాలువలు, చెరువులు, నదులను నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. ముంపు ప్రమాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. తుపాన్ దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తుపాన్ ప్రభావంతో రోడ్లపై చెట్లు కూలి రవాణాకు అంతరాయం కలిగితే వెంటనే ఆ చెట్ల కొమ్మలను తొలగించి రహదారి మార్గాలను పునరుద్ధరించేందుకు సకాలంలో చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు.