YS Sharmila | బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హేళనగా మాట్లాడారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. అంబేద్కర్ పేరును ఫ్యాషన్ అంటూ అవమానించారని మండిపడ్డారు. సభలో అంబేద్కర్ పేరు చెప్పగానే బీజేపీ ఎంపీలు నవ్వుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖపట్నంలో జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ పోస్టర్‌ను రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ శ్రీ మాణిక్యం ఠాగూర్‌తో కలిసి వైఎస్ షర్మిల ఆవిష్కరించారు. అనంతరం వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం రాసింది అంబేద్కర్ అని.. ఆయన రాసిన రాజ్యాంగం నేటికీ మనకు శాసనమని అన్నారు. మన ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు అని తెలిపారు. ప్రజలు సమానంగా,స్వేచ్ఛగా, సగౌరవంగా బతుకుతున్నారు అంటే రాజ్యాంగం కల్పించిన హక్కు వల్లే అని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజల జీవితాల్లో అంబేద్కర్ వెలుగు నింపారని.. అంటరానితనం నిర్మూలనపై అంబేద్కర్ జీవితకాలం పోరాటం చేశారని చెప్పారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అంబేద్కర్ జపం చేస్తుందని స్పష్టం చేశారు.
పార్లమెంట్ సాక్షిగా బీజేపీ రాజ్యాంగాన్ని హేళన చేస్తుంటే ఏపీకి చెందిన టీడీపీ, వైసీపీ, బీజేపీ ఎంపీలు మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. ఏపీ ప్రజలను ప్రధాని మోదీ వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. హోదా ఇస్తామని మోసం చేశారని.. మొన్న మోదీ విశాఖ వచ్చినప్పుడు కనీసం విభజన హామీలపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని అన్నారు. విశాఖ స్టీల్ మీద ఎటువంటి ప్రకటన చేయలేదని విమర్శించారు. ప్రైవేటీకరణ మీద వైఖరి ఏంటో చెప్పలేదని అన్నారు.
ఏపీ ప్రజలను ప్రధాని మోడీ @narendramodi దారుణంగా వెన్నుపోటు పొడిచారు. హోదా ఇస్తామని మోసం చేశారు. మొన్న మోడీ విశాఖ వచ్చినప్పుడు కనీసం విభజన హామీలపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. విశాఖ స్టీల్ మీద ఎటువంటి ప్రకటన లేదు. ప్రైవేటీకరణ మీద వైఖరి ఏంటో చెప్పలేదు. ఉత్తరాంధ్ర-రాయలసీమకు ప్రత్యేక… pic.twitter.com/RGuZjUOcrn
— YS Sharmila (@realyssharmila) January 10, 2025
ఏపీ ప్రజలను దారణంగా మోసం చేసిన మోదీతో చంద్రబాబు సక్రమ సంబంధం… జగన్‌ది అక్రమ సంబంధమని వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. బడుగు బలహీన వర్గాల ఓట్లుతో గెలిచిన జగన్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను గంగలో కలుపుతున్నారని విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి మతతత్వ బీజేపీని నిరంతరం వ్యతిరేకించారని గుర్తుచేశారు. ఆయన వారసులమని చెప్పుకునే జగన్ బీజేపీతో ఎందుకు కొమ్ముకొస్తున్నారని నిలదీశారు. రాజశేఖర్ రెడ్డి వారసుల్లో బీజేపీని వ్యతిరేకిస్తుంది నేను మాత్రమేనని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక విధానాలపై పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని తెలిపారు. ఈ రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక విధానాలపై పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని తెలిపారు. మన దేశాన్ని రక్షించుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీ అవసరమని అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. అంబేద్కర్‌ను అవమానించిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన రాజీనామా చేయకుంటే మోదీ వెంటనే అమిత్ షాను బర్తరఫ్ చేయాలన్నారు.