ఇంజినీరింగ్ విద్యార్థి రమ్య హత్య కేసులో గుంటూరు కోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. దిశ స్ఫూర్తితో ఈ కేసు దర్యాప్తులో సమర్థవంతంగా వ్యవహరించిన పోలీసులను సీఎం అభినందించారు. ప్రాసిక్యూషన్ న్యాయవాదిని కూడా ఈ సందర్భంగా సీఎం అభినందించారు.
”విద్యార్థిని రమ్య హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును స్వాగతిస్తున్నాను. ఈ కేసు విషయంలో వేగంగా దర్యాప్తు పూర్తిచేసి, నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ శాఖకు అభినందనలు.” అంటూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో గుంటూరు ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. గతేడాది ఆగస్టు 15వ తేదీన పట్టపగలే నడిరోడ్డుపై రమ్యను కుంచాల శశికృష్ణ అనే యువకుడు అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. ఈ కేసులో 9 నెలల పాటు విచారణ కొనసాగించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు.. నిందితుడికి ఉరి శిక్షను ఖరారు చేస్తూ తుది తీర్పును శుక్రవారం వెల్లడించింది. ఈ క్రమంలో రమ్య కుటుంబ సభ్యులు కోర్టు తీర్పును స్వాగతించారు. నిందితుడికి సరైన శిక్ష పడిందన్నారు. తమ బిడ్డ ఆత్మకు శాంతి చేకూరేలా కోర్టు తీర్పు ఉందని రమ్య తల్లిదండ్రులు చెప్పారు.
విద్యార్థిని రమ్య హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును స్వాగతిస్తున్నాను. ఈ కేసు విషయంలో వేగంగా దర్యాప్తు పూర్తిచేసి, నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ శాఖకు అభినందనలు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 29, 2022