Srisailam | ఆగస్టు ఒకటో తేదీన శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించనున్న ఏపీ సీఎం నారాచంద్రబాబు నాయుడు పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను నంద్యాల జిల్లా కలెక్టర్ జీ రాజకుమారి ఆదేశించారు. మంగళవారం అన్నపూర్ణ ప్రసాద వితరణ భవన సముదాయంలోని సీసీ కంట్రోల్ రూమ్లో జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్, జాయింట్ కలెక్టర్ సీ విష్ణుచరణ్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి డీ పెద్దిరాజుతో కలిసి సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జీ రాజకుమారి మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైల క్షేత్ర పర్యటన పర్యటనకు ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు ఒకటో తేదీ ఉదయం 9.50 గంటలకు సీఎం చంద్రబాబు సున్నిపెంట హెలిప్యాడ్ చేరుకుంటారని తెలిపారు. అటుపై శ్రీస్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుంటారన్నారు. శ్రీశైల ప్రాజెక్టుకు వద్ద జలహారతి కార్యక్రమం, కుడిగట్టు జలవిద్యుత్ కేంద్ర (ఏపీ జెన్కో) సందర్శన, సున్నిపెంటలోని వాటర్ యూజర్స్ అసోసియేషన్ వారితో ముఖాముఖి చర్చాగోష్టిలో సీఎం పాల్గొంటారని వివరించారు. హెలీప్యాడ్, శ్రీశైలం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో సమగ్ర ఏర్పాట్లు చేయాలని అధికారులను రాజకుమారి ఆదేశించారు.
సాగునీటి వినియోగదారుల సంఘం సభ్యులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి సభావేదిక, కార్యక్రమ నిర్వహణ, ముఖాముఖి, ఇష్టాగోష్టి చర్చల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాజకుమారి పలు ఆదేశాలు జారీ చేశారు. సభా వేదిక వద్ద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యశాఖ సిబ్బందిని అదేశించారు. సీఎం ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు సభావేదిక వద్ద ఏర్పాట్లు కూడా చేయాలన్నారు. ఆలయ దర్శనం, ఆలయంలో పూజాదికాలు తదితర అంశాల గురించి దేవస్థానం ఈఓ డీ పెద్దిరాజు వివరించారు.