Chandrababu | గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై విచారణ కొనసాగుతోందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఆడపిల్లల రక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. రాష్ట్రమంతా ఏదో జరిగిపోతోందని ప్రచారం చేయడం దారుణమని విమర్శించారు. ఆడబిడ్డలపై దుష్ప్రచారం చేయడం మంచిది కాదని సూచించారు.
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై దర్యాప్తు కోసం ఢిల్లీ సాంకేతిక నిపుణుల సాయం తీసుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు. అనుమానం ఉన్నవారి ఫోన్లు, కంప్యూటర్లు తనిఖీ చేస్తామని పేర్కొన్నారు. గుడ్లవల్లేరు ఘటనపై ఆధారాలు ఉంటే పోలీసులకు ఇవ్వాలని సూచించారు. బాబాయిని చంపేసి తనపై అభాండాలు వేశారని మండిపడ్డారు. రాజకీయాల్లో ఉన్న రౌడీలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఏదైనా జరిగితే అదే మీకు చివరి రోజు అవుతుందని వార్నింగ్ ఇచ్చారు. అవాస్తవాలు ప్రచారం చేసేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమైందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అసాధారణ వర్షాల వల్లే ముంపు ప్రాంతాలు పెరిగాయని తెలిపారు. వత్సవాయిలో 32 సెం.మీ.వర్షపాతం నమోదైందని తెలిపారు. భారీ వర్షాలపై చంద్రబాబు సమీక్షించారు. జాతీయ రహదారులు కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారు. దురదృష్టవశాత్తూ 9 మంది చెందారని.. ఒకరు గల్లంతయ్యారని పేర్కొన్నారు. ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. రిజర్వాయర్లు అన్ని నిండిపోయాయని.. వీటీపీఎస్‌లో విద్యుదుత్పత్తి నిలిచిపోయిందన్నారు. భారీగా పంట నష్టం జరిగిందని.. రోడ్లు దెబ్బతిన్నాయని చెప్పారు. రెండు హెలికాప్టర్లు, భారీగా బోట్లు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పారు.
భారీ వర్షాలు, వరదలను ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చంద్రబాబు అన్నారు. సహాయక చర్యల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలని సూచించారు. 107 క్యాంపులు పెట్టామని.. 17 వేల మందిని తరలించామని అన్నారు. ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. వరద ముంపు ప్రాంతాలకు బోట్లు పంపించామని అన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం పెరగకుండా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. వరద బాధితులకు రూ.25 కేజీల బియ్యం, కేజీ పంచదార, ఆయిల్, ఉల్లి, బంగాళాదుంపలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. మత్స్యకారులకు అదనంగా 25 కేజీల బియ్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విజయవాడకు ఈ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి అంశాన్ని సున్నితంగా తీసుకుంటామని తెలిపారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామన్నారు. రేపు పాఠశాలలకు సెలవు ప్రకటించామని తెలిపారు.